హనుమాన్ చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఒక పెద్ద వివాదంలో చిక్కుకుని టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారారు. ఈ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ వర్మ ఇద్దరి మధ్య ఉన్న ఆర్థిక వ్యవహారాలు, అడ్వాన్స్ లు, సినిమా కమిట్‌మెంట్స్ అన్నీ ఇప్పుడు బయటకు రావడంతో ఇండస్ట్రీ కి షాక్ తగిలింది.
హనుమాన్ భారీ విజయం తర్వాత, తమ బానర్ లో ఇంకా ఐదు సినిమాలు — అధిరా, మహాకాళి, జై హనుమాన్, బ్రహ్మ రాక్షస, ఆక్టోపస్—డైరెక్ట్ చేస్తానని ప్రశాంత్ వర్మ వాగ్దానం చేశారని, వాటికోసం మొత్తంగా రూ.10 కోట్ల అడ్వాన్స్ ఇచ్చానని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
కానీ ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోకుండా, కొన్ని సినిమాలను తన అసోసియేట్స్ తో చేయిస్తానని చెప్పడం, రెండు సంవత్సరాలు గడిచినా ఒక్క సినిమా కూడా సెట్స్ పైకి రాకపోవడం, పైగా బయట నిర్మాతలతో కలిసి అదే టైటిల్స్ మీద చర్చలు జరపడం వంటివి జరిగాయని ఆరోపించారు.
ఈ కారణంగా తాను భారీగా డబ్బులు, ఇమేజ్ కోల్పోయానని, మానసిక ఒత్తిడికి గురయ్యానని చెబుతూ ప్రశాంత్ వర్మ రూ.200 కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ప్రశాంత్ వర్మ అన్ని ఆరోపణలను ఖండిస్తూ, హనుమాన్ 12 నెలల్లో పూర్తయ్యే ప్రాజెక్ట్ కాగా నిర్మాతకు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండటంతో అది ఆలస్యం అయ్యిందని, ఈ సినిమా రూ.295 కోట్ల వసూళ్లు సాధించినా తనకు కేవలం రూ.7.82 కోట్లు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. అలాగే లాభాల 50-50 షేరింగ్ కి సంబంధించిన ఒప్పందాలను కూడా ప్రొడ్యూసర్ పట్టించుకోలేదని పేర్కొన్నారు.

ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం బయటకు రావడంతో ఇండస్ట్రీ లోపల ఒక పెద్ద చర్చ మొదలైంది—ఇది సాధారణ నిర్మాత-దర్శకుల మధ్య తగాదా మాత్రమేనా? లేక టాలీవుడ్ లో వచ్చే పెద్ద ఫైనాన్షియల్ రిఫార్మ్స్ కి ఇది మొదటి సంకేతమా? అన్న ప్రశ్నలు అందరిలో తలెత్తుతున్నాయి. ఇక ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని వివాదాన్ని పరిష్కరిస్తుందా? లేక ఇది ఇంకా పెద్దదై కోర్టుల దాకా వెళ్తుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

నిరంజన్ రెడ్డి లేఖ (11.10.2025) ముఖ్యాంశాలు:
• హనుమాన్ తర్వాత మొత్తం ఐదు సినిమాలు (అధిరా, మహాకాళి, జై హనుమాన్, బ్రహ్మ రాక్షస, ఆక్టోపస్) చేస్తానని ప్రసాంత్ వర్మ ఒప్పందం చేసుకున్నారని పేర్కొన్నారు.
• ఈ ప్రాజెక్టులకోసం మొత్తం 10 కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చామని తెలిపారు.
• కానీ తరువాత ప్రసాంత్ వర్మ తాను డైరెక్టర్ గా కాకుండా కొన్నింటిని సూపర్వైజ్ చేస్తానని చెప్పాడని, అలాగే మరో నిర్మాతలతో కలిసి సినిమాలు చేయడానికి ప్రయత్నించాడని ఆరోపించారు.
• రెండు సంవత్సరాలు అయినా ఏ సినిమా కూడా సెట్స్ పైకి రాలేదని చెప్పారు.
• ఈ చర్యల వలన ఫైనాన్షియల్, ఇమేజ్ నష్టం జరిగిందని 200 కోట్ల రూపాయల కంపెన్‌సేషన్ కోరారు.
• హోంబలే, మైత్రి మూవీ మేకర్స్, RKD స్టూడియోస్ వంటి కంపెనీలు ఈ ప్రాజెక్టులు ఫర్ధర్ కాంటిన్యూ చేయకూడదని డిమాండ్ చేశారు.
ప్రశాంత్ వర్మ కౌంటర్ రిప్లై:
• అన్ని ఆరోపణలను నిరాకరించారు.
• హనుమాన్ 12 నెలల్లో పూర్తి కావాలసింది కానీ నిర్మాత దగ్గర ఫండ్స్ లేక ఆలస్యమైందని అన్నారు.
• హనుమాన్ మూవీని 50:50 ప్రాఫిట్ షేరింగ్ తో చేసే ఒప్పందం చూపిస్తూ నిర్మాత ఒప్పందం ఉల్లంఘించాడని తెలిపారు.
• హనుమాన్ 295 కోట్ల గ్రాస్ వచ్చింది కానీ తనకు 7.82 కోట్లు మాత్రమే ఇచ్చారని చెప్పారు.
• నిర్మాత ఒప్పందం తప్పించుకోడానికి తప్పుడు కంప్లైంట్ ఇచ్చాడని ఆరోపించారు.
• ఐదు సినిమాల కమిట్‌మెంట్ల విషయమై పాయింట్ వైజ్ వివరణ ఇచ్చారు.