Native Async

ముసలమడుగు కుంకీ ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్

Deputy CM Pawan Kalyan Visits Musalamadugu Kunkie Elephant Training Center
Spread the love
  • కుంకీ ఏనుగుల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించిన ఉప ముఖ్యమంత్రివర్యులు
  • ఆకట్టుకున్న మదపుటేనుగులను కట్టడి చేసే విన్యానం
  • కుంకీలకు స్వయంగా ఆహారం అందించిన పవన్ కళ్యాణ్
  • కుంకీల బాధ్యత చూసే మావటీలకి ఉప ముఖ్యమంత్రివర్యులు రూ.50 వేలు బహుమానం
  • మియావకీ ఫారెస్ట్ ప్లాంటేషన్ కు శ్రీకారం
  • అధునాతన సోలార్ ఫెన్సింగ్ వ్యవస్థకు పునాది రాయి

మదపుటేనుగుల దాడుల నుంచి పంట పొలాలను, మనుషులను రక్షించేందుకు ప్రత్యేకంగా కర్ణాటక రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చిన కుంకీ ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదివారం సందర్శించారు.

ఆదివారం, చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం, ముసలమడుగు వద్ద ఉన్న శిక్షణ కేంద్రానికి విచ్చేసిన ఆయన ఏనుగుల శిక్షణ, సంరక్షణ తదితర అంశాలను స్వయంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. కర్ణాటక నుంచి తెచ్చిన నాలుగు కుంకీ ఏనుగులతోపాటు గతంలో ఇదే శిక్షణ కేంద్రంలో ఉన్న మూడు కుంకీలు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాయి. శిక్షణలో కుంకీ ఏనుగులు చూపుతున్న మెలకువలు, ఇటీవల జరిగిన ఆపరేషన్ల తీరును అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కుంకీ ఏనుగులు ప్రత్యేకంగా చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది.

క్రమబద్ధంగా కుంకీ ఏనుగులు వరుసగా వస్తూ ఘీంకారం చేస్తూ పవన్ కళ్యాణ్ కు సెల్యూట్ చేశాయి. అనంతరం అడవిలో లభ్యమయ్యే వివిధ రకాల కలపను ఏనుగుల సహాయంతో ఎలా బయటకు తీసుకువచ్చేది ఏనుగుల చేత ప్రదర్శింపజేశారు. మానవ, ఏనుగుల మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు మదపుటేనుగుల గుంపు, నివాసాలు, పంట పొలాల వైపు వస్తున్నప్పుడు వాటిని ఎలా నియంత్రించాలో ప్రత్యక్షంగా కుంకీ ఏనుగుల చేత చేయించిన ప్రదర్శన ఆకట్టుకుంది. మదపుటేనుగులు అదుపు తప్పినప్పుడు వాటికి ఓ ప్రత్యేకంగా మత్తు ఇచ్చి వాటి కోపాన్ని ఎలా అణిచి వేస్తారు అన్నది మావటీలు పవన్ కళ్యాణ్ కు చూపించారు. మత్తు ఇచ్చే ఇంజెక్షన్ గన్ ను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా కుంకీ ఏనుగులు చేసిన ప్రదర్శనలు ఉప ముఖ్యమంత్రివర్యులు ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఏనుగులకు ఆయన స్వయంగా బెల్లం ఆహారం అందించారు. అనంతరం గజరాజుల ఆశీర్వచనం తీసుకున్నారు.

  • ముసలమడుగు ఏనుగుల క్యాంపు ప్రారంభోత్సవం:
    అనంతరం పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో ముసలమడుగులో ఏర్పాటు చేసిన నూతన ఏనుగుల క్యాంపును ప్రారంభించారు. అందుకు సంబంధించిన శిలా ఫలకాన్ని ప్రారంభించారు. ఏనుగుల క్యాంపులో ఏర్పాటు చేయనున్న గజారామం నగర వనానికి పునాదిరాయి వేశారు. సౌర శక్తితో పని చేసే వేలాడే అటవీ ఏనుగుల నిరోధక కంచె నిర్మాణానికి పవన్ కళ్యాణ్ పునాది రాయి వేశారు.
  • మియావకీ తరహా ప్లాంటేషన్ కి శ్రీకారం:
    తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు పెంచడం ద్వారా అడవిని పెంపొందించే మియావకీ తరహా ప్లాంటేషన్ కు, ముసలమడుగు కుంకీ ఏనుగుల శిక్షణ కేంద్ర వద్ద పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. 250 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్లాంటేషన్ ను ఏర్పాటు చేశారు. ఉసిరి మొక్కను నాటి పవన్ కళ్యాణ్ ఈ దట్టమైన అడవుల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మీటరకు ఒక్కటి చొప్పున నాటిన మియావకీ ప్లాంటేషన్ ను స్వయంగా మొబైల్ లో వీడియో తీసుకున్నారు. మధ్యన పొదలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారని అటవీ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
  • మావటీలకి ఉప ముఖ్యమంత్రివర్యులు రూ.50 వేలు బహుమానం:
    కర్ణాటక ప్రభుత్వం నుంచి కుంకీ ఏనుగులను స్వీకరించేటప్పుడు వీటిని జాగ్రత్తగా చూసుకుంటామని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ విధంగానే పలమనేరు ఎలిఫెంట్ క్యాంపులో మావటీలు.. కుంకీల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. వారి పని తీరు మెచ్చుకుంటూ, పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులు రూ.50 వేలు బహుమానంగా అందించారు.

ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే, పీసీసీఎఫ్ శ్రీ పి.వి. చలపతిరావు, అటవీ శాఖ సలహాదారు శ్రీ మల్లికా ర్జునరావు, చిత్తూరు జిల్లా కలెక్టర్ శ్రీ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడీ, అనంతపురం, తిరుపతి ఫారెస్ట్ కన్జర్వేటర్లు శ్రీమతి యశోద బాయి, చిత్తూరు డీఎఫ్ఓ శ్రీ సుబ్బురాజు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit