తమిళ సినీ పరిశ్రమలో కొత్త ఊపిరి నింపడానికి తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) ఆదివారం చెన్నైలో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో నిర్మాతలపై ఉన్న ఆర్థిక భారం తగ్గించడం, థియేటర్ వ్యాపారాన్ని తిరిగి బలోపేతం చేయడం వంటి కీలక అంశాలపై చర్చించారు.
ఈ సమావేశంలో తీసుకున్న ప్రధాన నిర్ణయం — పెద్ద బడ్జెట్ సినిమాలకు రెవెన్యూ షేరింగ్ మోడల్ అమలు చేయడం. ఇకపై ప్రముఖ నటులు, టాప్ టెక్నీషియన్లు తమ పారితోషికం మొత్తం ముందుగానే తీసుకోకుండా, సినిమా లాభాలు, నష్టాల్లో నిర్మాతలతో పంచుకోవాలి. ఈ నిర్ణయానికి రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య, ధనుష్, విక్రమ్, శివకార్తికేయన్, విశాల్, STR వంటి ప్రముఖులు సహకరించాలని కౌన్సిల్ విజ్ఞప్తి చేసింది.
థియేటర్ బిజినెస్‌కి రక్షణ కల్పించేందుకు OTT స్ట్రీమింగ్ గ్యాప్ కూడా పెంచాలని నిర్ణయించారు. పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలో విడుదలైన తర్వాత 6 నుంచి 8 వారాలు గడిచిన తర్వాతే OTTలో స్ట్రీమ్ కావాలి. మధ్యస్థాయి సినిమాలకు ఆరు వారాల గ్యాప్, చిన్న సినిమాలకు తక్కువ సమయం ఉంటుంది.
అలాగే తమిళనాడు ప్రభుత్వం తక్కువ సర్వీస్ చార్జీలతో స్వంత ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫార్మ్ ప్రారంభించాలని TFPC కోరింది. దీంతో ప్రేక్షకులకు టికెట్లు చౌకగా లభిస్తాయి, అలాగే థియేటర్లకు కూడా పారదర్శకత ఉంటుంది.
సంవత్సరానికి విడుదలయ్యే 250 చిన్న, మధ్యస్థాయి సినిమాలకు సరైన థియేటర్ అవకాశాలు లభించేందుకు ఫిల్మ్ రిలీజ్ రెగ్యులేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో నిర్మాతలతో పాటు థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్ల సంఘం ప్రతినిధులు ఉంటారు.
అలాగే అనధికార అవార్డ్ ఫంక్షన్లు, యూట్యూబ్ రివ్యూ ఛానళ్ల ద్వారా సినిమా విమర్శల దుర్వినియోగం జరుగుతుందని కౌన్సిల్ హెచ్చరించింది. నటులు, దర్శకులు వెబ్ సిరీస్‌ల కంటే థియేటర్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.
చివరగా, తమిళనాడు ప్రభుత్వం అందిస్తున్న నిరంతర మద్దతుకు TFPC కృతజ్ఞతలు తెలిపింది. షూటింగ్ అనుమతుల కోసం తీసుకొచ్చిన సింగిల్ విండో సిస్టమ్, సర్వీస్ ట్యాక్స్‌ను 4 శాతానికి తగ్గించడం, అలాగే పయ్యనూర్‌లో 100 ఎకరాల భూమిని సినిమా కార్మికుల గృహ నిర్మాణం కోసం కేటాయించడం వంటి చర్యలను ప్రశంసించింది.
ఈ మార్పులతో తమిళ సినిమా పరిశ్రమలో కొత్త ఆశలు, కొత్త దిశ మొదలయ్యే అవకాశముంది.