దుల్కర్ సల్మాన్ నటించిన కాంత సినిమా ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కానీ రిలీజ్ కు కొన్ని రోజులు ముందు ఈ సినిమా అనుకోని లీగల్ ఇష్యూ లో చిక్కుకుంది. ప్రముఖ తమిళ నటుడు, గాయకుడు ఎం.కె. త్యాగరాజ భగవతార్ మనవడు బి. త్యాగరాజన్ చెన్నై సివిల్ కోర్టులో ఫిర్యాదు చేశాడు. “ఈ సినిమా మా తాతగారి జీవిత కథ ఆధారంగా తీసుకున్నారు, కానీ మా కుటుంబ అనుమతి లేకుండా చేశారు. అంతేకాదు, మా తాతగారిని ప్రతికూలంగా చూపించేలా సినిమా తీశారు” అని ఆయన ఆరోపించారు.
ఈ కేసుతో సినిమా రిలీజ్ పై సందేహాలు మొదలయ్యాయి. చాలామంది ఈ సినిమా వాయిదా పడొచ్చని భావించారు. అయితే నిర్మాత రానా దగ్గుబాటి మాత్రం వెంటనే స్పందించి, “ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, కాంతలో ఎలాంటి రియల్ రిఫరెన్స్ లేదు, సినిమా షెడ్యూల్ ప్రకారమే నవంబర్ 14న రిలీజ్ అవుతుంది” అని స్పష్టంగా చెప్పారు.
ఈ ఉదయం రానా తన X (ట్విట్టర్) హ్యాండిల్ లో Q&A సెషన్ కూడా చేశారు. అందులో ఒక అభిమాని “చెన్నైలో కాంత సినిమా రిలీజ్ ఆపాలన్న కేసు ఉందంటారా?” అని అడగగా, రానా సమాధానంగా “అది పూర్తిగా బేస్‌లెస్ న్యూస్, సినిమాకి ఏ రియల్ కనెక్షన్ లేదు. నవంబర్ 14న థియేటర్స్ లో కలుద్దాం!” అని రిప్లై ఇచ్చాడు.
రానా మరియు డుల్కర్ ఇద్దరూ ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో చెప్పినట్టు, కాంత సినిమా ఒక పూర్తిగా ఫిక్షనల్ కథ. ఇది 1950ల తమిళ సినీ ప్రపంచం నేపథ్యంలో కొన్ని సన్నివేశాల నుండి ప్రేరణ పొందిన కథ మాత్రమేనని వారు స్పష్టం చేశారు. రానా చెప్పిన ప్రకారం చూస్తే, ఈ టీమ్ తమ మీద వచ్చిన ఆరోపణలను నిరూపించి, సినిమా ప్లాన్ ప్రకారమే రిలీజ్ చేసే నమ్మకంతో ఉన్నట్టు తెలుస్తోంది.
కాంత ఒక పీరియడ్ డ్రామా మాత్రమే కాదు — భావోద్వేగాలు, పాత కాలపు సినీ వైభవం కలిసిన ఒక కథ. ఈ సినిమాను రానా దగ్గుబాటి నిర్మించడమే కాకుండా, కీలక పాత్రలో కూడా నటించాడు. అలాగే సముతిరఖని, భాగ్యశ్రీ భోర్స్ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
ఇంత హైప్ మధ్య రిలీజ్ అవుతున్న కాంత సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి!