సమావేశంలో ముఖ్య అంశాలు:
*ఎవరి ఆక్రమణలో ఎంత ఉంది? వారిపై నమోదైన కేసుల వివరాలు ప్రజలకి తెలియాలి
*అటవీ ఆస్తులను కబ్జా చేస్తే కఠిన చర్యలకి ఉపక్రమించండి
*మంగళంపేట అటవీ భూముల ఆక్రమణలపై విజిలెన్స్ రిపోర్డులను ప్రాతిపదికగా తీసుకొని ముందుకు వెళ్ళాలి
*మాజీ అటవీ శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి కుటుంబానికి అడవుల్లో వారసత్వ భూములెలా వచ్చాయి..?
*రాజకీయాలకు అతీతంగా భావి తరాలకు ప్రకృతి సంపద అందించాలి
*అటవీ భూముల పరిరక్షణపై ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి దిశానిర్దేశం
అటవీ భూములు ప్రకృతి సంపద.. జాతి ఆస్తి. వాటిని ఆక్రమించిన వారు, చట్టాన్ని ఉల్లంఘించి అతిక్రమణలకు పాల్పడిన వారు కచ్చితంగా శిక్షార్హులవుతారు. అటవీ భూముల జోలికి వెళితే అది ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు. అటవీ భూములను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దీన్ని నెరవేర్చే ప్రక్రియను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చేపడుతుందని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు.
వన్య ప్రాణి రక్షిత అటవీ భూముల్లోను, అటవీ ప్రాంతాల్లోనూ అటవీ ఆస్తులు కబ్జా చేసి భారీ భవంతులు, ఎస్టేట్స్ నిర్మించినవాళ్లు ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా చట్ట ప్రకారం ముందుకు వెళ్ళాలి అన్నారు. అటవీ భూములను రక్షించుకొని, రాబోయే తరాలకు అందజేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఎవరికీ భయపడాల్సిన పని లేదని, మనో ధైర్యంతో ముందుకు వెళ్దామని అటవీ అధికారులకు భరోసా ఇచ్చారు. పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, మంగళంపేటలో మాజీ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబసభ్యుల చేతిలో ఉన్న సుమారు 104 ఎకరాల అటవీ భూములపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
రాష్ట్ర సచివాలయంలో సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మాజీ అటవీ శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబసభ్యుల అటవీ భూముల ఆక్రమణల మీద తన వద్ద ఉన్న నివేదికలు, వీడియోలు, ఇతర సమాచారం గురించి ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రుల వద్ద పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. త్వరలోనే అన్ని వివరాలతో ఆక్రమణ విషయాన్ని వెల్లడిస్తామని చెప్పారు. ఇటీవల చిత్తూరు జిల్లా, ముసలిమడుగు కుంకీ ఏనుగుల శిక్షణ శిబిరం సందర్శించిన అనంతరం హెలికాప్టర్ ద్వారా మంగళంపేట అటవీ ఆక్రమణలను పరిశీలించారు. అడవిలో వేసిన కంచె, సరిహద్దులను విహంగ వీక్షణం ద్వారా తెలుసుకున్నారు. ఈ క్రమంలో అటవీ భూములు, శాఖ ఆస్తులు పరిరక్షణ అంశంపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో తాజాగా సమీక్షించారు.
మంగళంపేట అటవీ భూముల అంశాన్ని అధికారులు వివరించారు. అటవీ చట్టం ప్రకారం ప్రిలిమినరీ అఫెన్స్ రిపోర్ట్ (పి.ఓ.ఆర్.), ఛార్జ్ షీట్ దాఖలు చేశామని అటవీ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఆక్రమణలు తొలగించి స్వాధీనం చేసుకున్నామని, కోర్టులో కేసుల వివరాలు ప్రొడ్యూస్ చేశామన్నారు. పి.ఓ.ఆర్., విజిలెన్స్ నివేదిక వివరాలపై చర్చించిన ఉప ముఖ్యమంత్రివర్యులు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
‘‘అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలు శాఖ వెబ్ సైట్ లో వెల్లడించాలి. ఈ దిశగా ప్రణాళిక సిద్ధం చేయండి. ఎవరి ఆక్రమణలో ఎంత అటవీ ఆస్తి ఉంది? వారిపై నమోదైన కేసుల వివరాలు, ప్రస్తుతం సదరు కేసులు ఏ స్థితిలో ఉన్నాయి లాంటి వివరాలు ప్రజలకి తెలియాలని పేర్కొన్నారు.
అటవీ భూముల పరిరక్షణకు ఉద్దేశించిన చట్టం కఠినంగా ఉంది. చట్టం ప్రకారం ముందుకు వెళ్లాల్సిన విధి అధికార యంత్రాంగంపై ఉంది. అటవీ ఆస్తులను కబ్జా చేస్తే కఠిన చర్యలకి ఉపక్రమించండి.
మంగళంపేట అటవీ భూముల వ్యవహారం చూస్తే చట్టం కఠినంగా ఉన్నా అమలు ఆ విధంగా లేకపోవడం మూలంగానే ఆక్రమణలు సాగాయి. మంగళంపేట సర్వే నంబరు 295, 296ల్లో ఉన్న అసలు భూమి విస్తీర్ణం ఎంత..? అది కాలానుగుణంగా ఎలా పెరిగింది అనేది కీలకమైన అంశం. సర్వే నంబర్లను సబ్ డివిజన్ చేసి, అటవీ భూములను ఓ ప్రణాళిక ప్రకారం కలిపేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఓ రకమైన భూ లెక్కలు, అండంగల్ లో మరో రకం భూ లెక్కలు కనిపిస్తున్నాయి. వెబ్ ల్యాండ్ నమోదులోనూ మతలబు ఉన్నట్టు కనిపిస్తోంది. ఇదంతా ఎలా జరిగింది..? ఎవరి ప్రమేయం ఉంది అనే అంశాలపై దృష్టి పెట్టాలి.
న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి:
శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు శ్రీ మిథున్ రెడ్డిలు 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ అటవీ భూముల గురించి వారి అఫిడవిట్ లో తప్పుడు సమాచారం అందించారనే అంశం నా దృష్టికి వచ్చింది. ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోండి. న్యాయ నిపుణుల సలహా ప్రకారం ముందుకు వెళ్ళాలి. అలాగే భూమి రిజిస్ట్రేషన్ రికార్డుల ప్రకారం 45.80 ఎకరాలు వాళ్ళ అధీనంలో ఉంటే, వెబ్ ల్యాండ్ లోకి వచ్చేసరికి ఆ భూమి 77.54 ఎకరాలుగా చూపారు. ఒకేసారి ఎందుకు ఇంత పెరిగిందన్నది కూడా పరిశీలించాలి. మాజీ అటవీ శాఖ మంత్రి కుటుంబానికి అడవి మధ్యలో ఉన్న భూమి వారసత్వంగా వచ్చిందని చెబుతున్నారు. అసలు అడవి మధ్యలో వారసత్వ భూమి ఎలా వచ్చింది, ఈ భూమి ఎలా ఎప్పుడు చేతులు మారిందనేది తెలుసుకోవాలి. దీనిలో ఎవరి పాత్ర ఎంత అనే దానిపై నివేదికలు తయారు చేయండి.
శ్రీ పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై మంగళంపేట అటవీ భూముల ఆక్రమణల మీద ప్రసారమాధ్యమాల్లో కథనాలు వచ్చిన తర్వాత ప్రభుత్వం వేగంగా స్పందించింది. విచారణ కోసం విజిలెన్స్ కమిటీ నియమించింది. ఈ కమిటీ రిపోర్టు అత్యంత కీలకం. ఈ నివేదికలో శ్రీ పెద్దిరెడ్డితో పాటు ఆయన కుటుంబం ఆక్రమించిన భూముల తాలుకా పూర్తి వివరాలను పొందుపరిచారు. దీన్ని ప్రాతిపదికగా తీసుకోవాలి.
అటవీ భూములను ఇష్టానుసారం ఆక్రమించేవారిని ప్రభుత్వం ఉపేక్షించదు. ప్రజలకు సంబంధించిన ఆస్తులు, జాతికి సంబంధించిన ఆస్తులపై కన్నేసే వారిపై నిఘా ఉంచుతాం. ప్రకృతి వనరులను దోపిడీ చేసేవారు, ఆక్రమించుకునే వారిపై రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకుంటాం అని స్పష్టం చేశారు.