ఆఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం (తాలిబాన్ పాలనలో) పాకిస్తాన్‌తో ఉన్న అన్ని రకాల వ్యాపార, సరుకు రవాణా కార్యకలాపాలను నిలిపివేసింది. ఈ నిర్ణయంతో రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే తాలిబాన్ ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాన్ని సిద్ధం చేసుకుంది. అదే హెరాత్–ఖాఫ్ రైల్వే మార్గం.
తాజాగా ఈ హెరాత్–ఖాఫ్ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయింది, దీని ద్వారా ఆఫ్ఘానిస్తాన్ నేరుగా ఇరాన్‌తో… అక్కడి నుండి యూరప్ దేశాలతో కూడా రవాణా సంబంధాలు ఏర్పరుచుకుంది. ఈ రైల్వే లైన్ పొడవు సుమారు 225 కిలోమీటర్లు. ఇందులో 140 కిలోమీటర్లు ఇరాన్ పరిధిలో, మిగిలిన భాగం ఆఫ్ఘానిస్తాన్‌లో ఉంది.
ఈ కొత్త మార్గం ద్వారా ఆఫ్ఘానిస్తాన్ ఇకపై పాకిస్తాన్ మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఇప్పటి వరకు ఆఫ్ఘానిస్తాన్ యొక్క ప్రధాన వాణిజ్య మార్గాలు కరాచీ, క్వెట్టా, టోర్ఖమ్ బోర్డర్ ద్వారా పాకిస్తాన్ పోర్టుల మీద ఆధారపడి ఉండేవి. కానీ ఇప్పుడు ఇరాన్‌లోని చాబహార్ పోర్ట్, ఈ హెరాత్–ఖాఫ్ రైలు మార్గం ఆఫ్ఘానిస్తాన్‌కు కొత్త ఆర్థిక అవకాశాలను తెరిచాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది దక్షిణాసియా, మధ్య ఆసియా భూభాగంలో జియోపాలిటికల్ సమీకరణలను మార్చే నిర్ణయం కావచ్చు. పాకిస్తాన్‌తో సంబంధాలు చల్లబడటంతో తాలిబాన్ ఇప్పుడు ఇరాన్… రష్యా మద్దతును పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది.
ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత, ఆఫ్ఘానిస్తాన్ ఇంధన దిగుమతులు, ధాన్యాలు, నిర్మాణ సామాగ్రి వంటి సరుకులను తక్కువ ఖర్చుతో దిగుమతి చేసుకునే అవకాశం లభించింది. అదే సమయంలో, తాలిబాన్ ఆర్థిక స్వాతంత్ర్యానికి ఇది ఒక పెద్ద మైలురాయిగా భావిస్తున్నారు.
ఈ నిర్ణయంతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది, ఎందుకంటే ఆఫ్ఘాన్ ట్రాన్సిట్ ట్రేడ్ ద్వారా ప్రతి సంవత్సరం కోట్ల డాలర్ల ఆదాయం పాకిస్తాన్ పొందేది. ఆఫ్ఘాన్‌తో తెగతెంపులు చేసుకోవడంతో పాక్ ఆర్థికంగా మరింత దిగజారిపోయే అవకాశం ఉంది.