రాజస్థాన్లోని ధోల్పూర్ అచలేశ్వర్లో ప్రతిష్టించిన శివలింగం ప్రతిరోజూ మూడుసార్లు రంగులు మారుస్తుంది. ఎందుకు ఇలా మారుతుంది అని చెప్పడానికి ప్రత్యేకమైన కారణాలు లేవు. మహాశివుని మహిమే కారణం అంటారు. ఈ శివలింగంపై శాస్త్రవేత్తలు ఎన్నో దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నా… మిస్టరీని చేధించలేకపోయారు. ఈ శివలింగం ఉదయం సమయంలో ఎర్రగాను, మధ్యాహ్నం సమయంలో కాషాయం రంగులోనూ సాయంకాలం సమయంలో చామన చాయ లేదా నీలం రంగులోనూ కనబడుతుంది. సాలగ్రామ రూపంలో ఉండే ఈ శివలింగం మూడు జాముల్లో మూడు రంగుల్లో కనిపించడం విశేషం.
ఆలయానికి వచ్చిన భక్తులు కూడా ఆలయంలో రంగులు మారే శివలింగాన్ని చూసి ఆశ్చర్యపోతుంటారు. స్వామివారిపై నమ్మకం ఉంచి సదా ప్రార్థిస్తుంటారు. ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు సాయంత్రం వరకు ఆలయంలోనే ఉండి మూడు రంగుల శివుడిని దర్శించుకుంటుంటారు. సూర్యుని కాంతి శివలింగంపై పడటం వలనే ఇలా జరుగుతుందని కొందరు చెబుతున్నా… సరైన కారణం ఇది కాదని శాస్త్ర వేత్తలు కూడా ఒప్పుకున్నారు. దాదాపు 2500 సంవత్సరాలుగా ఇక్కడ ఈ అద్భుతం కనిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏమంటే పంచలోహాలతో తయారైన నంది విగ్రహం. మూడు రంగులు మారే శివయ్యను చూస్తూ భక్తుల కోరికలను ఆ మహాశివుడికి తెలియజేస్తుంది నంది.