•గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేటి సంకల్పానికి నాడు శ్రీ బాబా వారు అంకురం వేశారు
•నాడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వపరమైన అనుమతులు ఇచ్చారు
•సేవాతత్పరతతో ఎంతో మందిని ప్రభావితం చేసిన ఆధ్యాత్మిక శక్తి శ్రీ సత్యసాయి బాబా వారు
•ఆధ్యాత్మిక తేజస్సు, విశ్వప్రేమ వల్లే అది సాధ్యపడింది
•శ్రీ సత్యసాయిబాబా వారి శతజయంతి ఉత్సవాల్లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
‘ప్రతి మనిషికీ రోజుకి కనీసం 55 లీటర్ల రక్షిత తాగునీరు ఇవ్వాలన్నది గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సంకల్పం. ప్రభుత్వపరంగా శ్రీ నరేంద్ర మోదీ గారు నేడు జల్ జీవన్ మిషన్ పథకాన్ని తీసుకువస్తే.. ఏ ప్రభుత్వం ఆలోచన చేయని రోజుల్లో ఓ ఆధ్యాత్మిక గురువుగా ప్రజల దాహర్తిని తీర్చాలన్న ఆలోచన శ్రీ సత్యసాయి బాబా వారు చేశారు. జల్ జీవన్ మిషన్ పథకానికి శ్రీ సత్యసాయి బాబా వారు ఎప్పుడో అంకురం వేశార’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
ప్రజల దాహం తీర్చాలన్న ఆలోచన వచ్చిన తరువాత శ్రీ సత్యసాయి బాబా వారు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి తెలియచేశారు. ఆ సత్కార్యానికి ప్రభుత్వపరమైన అనుమతులను శ్రీ చంద్రబాబు గారు సత్వరం అందేలా చూశారు. నేడు ఆ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోపాటు తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో లక్షలాది మంది ప్రజలకు తాగునీరు అందుతోందని చెప్పారు. ఆధ్యాత్మిక తేజస్సు, విశ్వప్రేమ ఉన్న వ్యక్తుల వల్లే ఇది సాధ్యమన్నారు.
బుధవారం పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతజయంతి ఉత్సవాలకు గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఇతర ప్రముఖులతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గొప్ప ఆధ్యాత్మిక తేజస్సు కలిగిన వారు. భారత దేశంలో, మన రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం జిల్లా, విపరీతమైన నీటి కొరత ఉండే జిల్లా, ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్లే జిల్లాలో ఆయన పుట్టారు. మహానుభావులు మాత్రమే అలాంటి జన్మను తీసుకోగలరు. శ్రీ సాయిబాబా వారి గొప్పదనం గురించి మన దేశస్తులకంటే విదేశీయులే ఎక్కువ చెబుతారు. 30 ఏళ్ల క్రితం సింగపూర్ లోని చైనీస్ ఇళ్లలో శ్రీ బాబా వారి ఫోటోలు చూశాను. స్టీవెన్ సిగాల్ అనే హాలీవుడ్ నటుడు బాబా గారిని కలవాలన్న తన కోరికను అన్నయ్య శ్రీ చిరంజీవి గారికి చెప్పి ఇక్కడికి వచ్చి బాబా వారి ఆశీర్వచనం తీసుకువెళ్లడం అప్పట్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. 40 ఏళ్ల క్రితం ఈ ప్రాంతానికి విదేశీ భక్తులు వస్తారని, ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడతారని ఎవరూ ఊహించరు. శ్రీ సత్యసాయి బాబా వారి ఆధ్యాత్మిక శక్తితోనే అది సాధ్యపడింది.
•శ్రీ బాబా వారి సేవా స్ఫూర్తిని కొనసాగిస్తాం:
శ్రీ సాయిబాబా వారి సేవాతత్పరతకు ప్రభావితం అయిన వారి సంఖ్య లెక్కలకందదు. పుట్టపర్తి వచ్చి సేవ చేసే ప్రముఖులను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక వ్యక్తి శ్రీ సచిన్ టెండూల్కర్ లాంటి ఎంతో మంది ప్రముఖులను ప్రభావితం చేశారు. అలాంటి అరుదైన ఆధ్యాత్మిక శక్తి మన భారత దేశంలో, మన రాష్ట్రంలో, మన అనంతపురం జిల్లాలో పుట్టడం ఎంతో ఆనందం కలిగించే అంశం. ఆయన సేవా స్ఫూర్తిని గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ముందుకు తీసుకువెళ్తాము అని మాటిస్తున్నామ”న్నారు.
•శ్రీ సత్యసాయి మహాసమాధి దర్శనం:
అంతకు ముందు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో కలసి ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాల్లో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మహా సమాధిని దర్శించుకున్నారు. శ్రీ బాబా వారి బంగారు విగ్రహం వద్ద నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు.
•శ్రీ సత్యసాయి బాబా వారి స్మారక నాణెం విడుదల:
శ్రీ సత్యసాయి బాబా వారి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రూపొందించిన రూ.100 స్మారక నాణాన్ని, పోస్టల్ స్టాంపులు గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విడుదల చేశారు. ప్రముఖ క్రికెటర్, భారతరత్న శ్రీ సచిన్ టెండూల్కర్ గారు, మాజీ మిస్ వరల్డ్ శ్రీమతి ఐశ్వర్యరాయ్ బచ్చన్ గారు, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ రత్నాకర్ గారు తదితరులు పాల్గొన్నారు.