సినిమాలో దమ్ముంటే చాలు… కథానాయకుడు ఎవరైనా సరే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి చప్పట్లు కొడతారు. థియేటర్లో ప్రేక్షకులను కుర్చీలోనుంచి లేవకుండా కూర్చేపెట్టే కథనాలు ఉంటే ఇక బొమ్మ హిట్టే. మరి అలాంటి హిట్ కోసమే యువహీరోలు, సీనియర్ హీరోలు ప్రయత్నిస్తున్నారు. కొంతమందికే అలా కూర్చొబెట్టడం సాధ్యమౌతుంది. అయితే, సాధారణ కథల కంటే థ్రిల్లింగ్ నేపథ్యం ఉన్న కథలు ప్రేక్షకులను త్వరగా ఆకట్టుకుంటాయి. కథలో లీనం చేస్తాయి. మంచి వసూళ్లు రాబడతాయి. ఇలాంటి ప్రయత్నమే చేశాడు అల్లరి నరేష్. కామెడీ పాత్రలను కాస్త పక్కన పెట్టి సీరియస్‌గా, తనలోని నటుడిని ఆవిష్కరించుకునే కోణంలో ఉండే పాత్రల కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వచ్చిన సినిమానే 12 ఏ రైల్వేకాలనీ.
థ్రిల్లింగ్ అంశాలు పుష్కలంగా ఉంటాయని, నరేష్ నటన మరోకోణంలో ఉంటుందని మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అయితే, సినిమా ఆధ్యంతం బ్లాక్ మ్యాజిక్, తాంత్రిక శక్తులు చుట్టూ తిరుగుతుంది. రైల్వేకాలనీలో అనుకోకుండా ఓ ఇంట్లో జరిగిన సంఘటన… దానిని చేధించే క్రమంలో వచ్చిన థ్రిల్లింగ్ అంశాలతో రైల్వేకాలనీని తయారు చేశారు. థ్రిల్లింగ్‌ని అక్కడక్కడా… చూపించినా… దానిని కంటిన్యూ చేయలేకపోయారు. ఇదే సినిమాకు కొంత మైనస్ అయింది. థ్రిల్లింగ్‌ని కంటిన్యూ చేసి ఉంటే సినిమా మరో విధంగా ఉండేది. కానీ, థ్రిల్లింగ్ లేకుండా కేవలం బ్లాక్ మ్యాజిక్, తాంత్రిక శక్తుల చుట్టూ కథను నడిపించడం, వాటి చిక్కుముడులను విడదీయడంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. రైల్వేకాలనీలో జరిగిన ఆ మర్డర్‌ని మరో కోణంలో ఛేదించినట్టైతే బాగుండు అని సగటు ప్రేక్షకుడు అనుకుంటూ బయటకు వస్తున్నారు.