కేరళలో ఒకప్పుడు బీజేపీకి అభ్యర్థులను నిలబెట్టేందుకు చాలా తంటాలు పడేది. అభ్యర్థులు దొరక్క అవస్థలు పడింది. ఆ పార్టీకి చేతివేళ్లపై లెక్కపెట్టేంత మంది నాయకులు మాత్రమే ఉండేవారు. కానీ, ఇప్పుడు అక్కడ పరిస్థితి క్రమంగా మారుతున్నది. కమలం పక్కన నిలబడటం కంటే ఒంటరిగా ఉండటమే మేలని భావించే రోజుల నుంచి కమలం జెండాలను చేతబూని వీధుల్లో ర్యాలీ చేసేస్థాయికి వచ్చింది. దీన్ని బట్టి కేరళ ప్రజల మనోభావాలు మారుతున్నాయని, పాత పార్టీనే అయినా కొత్తగా రాష్ట్రంలోకి ఆహ్వానిస్తున్నారని అర్థమౌతున్నది.
5 బిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న హనుమాన్ చాలీసా
దీనికి ఉదాహరణే ఇప్పుడు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు. కేరళ మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండగా, బీజేపీ 21,065 మంది అభ్యర్థులతో రంగంలోకి దిగింది. ఇందులో 19,871 మంది అభ్యర్థులు కమలం పార్టీ గుర్తుతో పోటీ చేస్తుండగా, మిగిలినవారు బీజేపీ మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ స్థాయిలో పార్టీకి అభ్యర్థులు దొరకడం విశేషం. ఈ మార్పు కేవలం ఎన్నికల కోసమే పోటీగా కాకుండా, ప్రజలు కమలాన్ని తమ చెంతకు చేర్చుకేందుకు ప్రయత్నిస్తున్నారని అర్ధమౌతున్నది. అంతేకాదు, పార్టీ కార్యకర్తలు కూడా జెండాలు పట్టుకొని చురుగ్గా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున యువత బీజేపీ వైపు మొగ్గుచూపుతుండటం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేయడం వంటి అనేక అంశాలు పార్టీకి బలంగా మారాయి.
ఇక కేరళలో రాజకీయ మార్పులపై చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రజల్లో కూడా ప్రస్తుత పాలనపై కొంత విసుగుతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పాలక, ప్రతిపక్ష పార్టీలు కాకుండా మరో పార్టీకి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బీజేపీ పావులు కదుపుతున్నది. అభ్యర్థులతో పాటు కార్యకర్తలు కూడా చురుగ్గా పనిచేస్తుండటంతో వచ్చే ఎన్నికల నాటికి కొంతమేర బలపడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.