దక్షిణాదిలో మలయాళం, తెలుగు, తమిళం ఇలా మూడు ఇండస్ట్రీల్లో వరుస విజయాలు అందుకుంటూ స్టార్‌గా ఎదిగిన దుల్కర్ సల్మాన్… బాలీవుడ్‌కు వెళ్లినప్పుడు మాత్రం అదే గౌరవం తనకు దక్కలేదని ఓపెన్‌గా చెప్పారు. Hollywood Reporter India నిర్వహించిన ప్రొడ్యూసర్స్ రౌండ్టేబుల్‌లో మాట్లాడిన దుల్కర్, తన బాలీవుడ్ అనుభవాలు నిజంగా ఆశ్చర్యపరుస్తాయి.
హిందీ సినిమాలు చేస్తున్న సమయంలో, సెట్లలో తనను ఇంకా తనతో వచ్చిన సిబ్బందిని ఇలా అక్కడి నుంచి ఇక్కడికి నెట్టివేసేవారని చెప్పారు.
“నేను హిందీ సినిమాలు చేసినప్పుడు… నా ఇద్దరు వర్కర్స్‌తో కలిసి సెట్లో అడుగు పెడితే మమ్మల్ని పక్కకు నెట్టేవారు. కుర్చీలు దొరకేవి కాదు… మానిటర్ దగ్గర కూర్చొని చూసే అవకాశం సులభంగా రాదు,” అని దుల్కర్ చెప్పారు.

అక్కడే ఒక నిజాన్ని గ్రహించానని ఆయన అంటారు —
“అది అంతా భ్రమ. మీరు ఖరీదైన కారులో వస్తే, మీతో చాలా మంది వస్తే… వెంటనే ‘ఇవ్వాళ ఓ స్టార్ వచ్చాడు’ అన్న భావన అవతలివారిలో ఉండేది. ఇది నిజంగా బాధాకరం. ఎందుకంటే ఒక నటుడి శక్తి ఇవన్నీ కాదు,” అని అన్నారు.
కానీ దక్షిణాదికి వస్తే మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం.
మలయాళంలోనా, తెలుగులోనా, తమిళంలోనా — దుల్కర్‌కే కాదు, ప్రతి నటుడికి సమాన గౌరవం, సమాన ఆదరణ సెట్లలో దక్కుతుందని ఆయన చెప్పారు. స్టార్ అనే కోణంలో చూసినా, మనిషిగా చూసినా, సెట్లో వారి విలువ తగ్గేలా ప్రవర్తించరని దుల్కర్ భావోద్వేగంగా చెప్పారు.
దక్షిణాదికి వచ్చే ఏ బాలీవుడ్ నటుడైనా అక్కడ వారికి అందే ఆతిధ్యం చూసి ఆశ్చర్యపడతారు. కానీ బాలీవుడ్‌లో మాత్రం కొద్దిమందికే ప్రత్యేక ప్రాధాన్యం… మిగతావారిని, వారు ఇతర ఇండస్ట్రీల్లో స్టార్లే అయినా, ‘సాధారణ నటులు’లా చూసే పరిస్థితి ఇంకా ఉందని ఆయన సూచించారు. అందుకే చాలా బాలీవుడ్ నటులు కూడా సౌత్‌లో పనిచేయడానికి ఇష్టపడుతుంటారని ఆయన అభిప్రాయపడ్డారు.
దుల్కర్ 2018లో కర్వాన్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. తరువాత ద జోయా ఫ్యాక్టర్, చుప్ చిత్రాలు చేశారు. తాజాగా తమిళంలో కాంతాలో నటించిన ఆయన, త్వరలోనే తెలుగులో ‘ఆకాశంలో ఓ తారా’, అలాగే మలయాళంలో ‘ఐ’మ్ ది గేమ్’ చిత్రాల్లో కనిపించనున్నారు.