జపాన్ బాక్సాఫీస్… ఇప్పుడు తెలుగు సినిమాల కొత్త అడ్డా అని అనాలేమో ఇంకా… ఎందుకు అంటారా??? ఇటీవలి కాలంలో టాలీవుడ్ సినిమాలకు అక్కడ పెరిగిన డిమాండ్ చూసి ట్రేడ్ వర్గాలే ఆశ్చర్యపోతున్నారు. రాజమౌళి RRR అక్కడ సెన్సేషన్ క్రియేట్ చేసిన తర్వాత, జపాన్ ప్రజలు మన హీరోలను తెగ ప్రేమిస్తున్నారు. దేవర, కల్కి 2898 AD సినిమాలు ఓ మోస్తరు ఆకర్షణ చూపించినా… టాప్-లీగ్ తెలుగు స్టార్‌లు జపాన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసే శక్తి ఉందని నిపుణులు నమ్ముతున్నారు.
ఇప్పుడు ఆ వరుసలో అడుగు పెట్టబోతున్నాడు మన పాన్-ఇండియా ఐకాన్ అల్లు అర్జున్. అతని రికార్డు బ్రేకింగ్ క్రైమ్ డ్రామా పుష్ప 2: ది రూల్ తో జపాన్ బాక్సాఫీస్ ను దుమ్ము రేపేందుకు సిద్ధమవుతున్నాడు. తాజా సమాచారం ప్రకారం, ఈ భారీ సీక్వెల్ జనవరి 16న జపాన్ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… మొదటి భాగం పుష్ప అక్కడ రిలీజ్ కాలేదు. కానీ, గ్లోబల్ స్థాయిలో రెండో భాగం సాధించిన విజయాన్ని చూసి, టీం ఇప్పుడు జపాన్ లో భారీ విడుదలకే ప్లాన్ చేసింది.
పుష్ప 2లో కొంత భాగం జపాన్ లో షూట్ చేసినప్పటికీ, కథలో టోక్యోకి ఉన్న కనెక్షన్ చాలా కీలకం. సినిమా ఆరంభం యోకోహామా పోర్ట్ దగ్గర పుష్ప రాజు తన శత్రువులతో చేసే ఘర్షణతో మొదలవుతుంది. తరువాత ఒక ఎమోషనల్ ఫ్లాష్‌బ్యాక్… అక్కడికి ఎలా వచ్చాడు అన్నదానికి అర్ధం చెబుతుంది. ఈ నేరేటివ్ కనేక్షన్ కారణంగా జపాన్ ప్రేక్షకుల హృదయాలకు పుష్ప 2 దగ్గరవుతుందని ట్రేడ్ సర్కిల్స్ నమ్ముతున్నాయి.
ఒకవేళ అల్లు అర్జున్ స్వయంగా జపాన్ వెళ్లి ప్రమోషన్స్ చేస్తే? మరి చెప్పాల్సిన అవసరం లేదు… పుష్ప 2కి అక్కడ బాక్సాఫీస్ బూస్ట్ రెట్టింపు అవుతుంది.
సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1800 కోట్ల గ్రాస్‌తో ఇండియన్ సినీ చరిత్రలో ఓ లెజెండరీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు అందరి దృష్టి జపాన్ బాక్సాఫీస్ వైపు మళ్లింది. అక్కడ కూడా సినిమా సాలిడ్ కలెక్షన్లు కొట్టగలిగితే… అల్లు అర్జున్ గ్లోబల్ రేంజ్ ఇంకో లెవల్ కి ఎత్తుకెళ్తుంది.