అరుణగిరి పర్వతంపై వెలిగే తిరుకార్తీక దీపం దక్షిణ భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో అపారమైన ప్రాధాన్యతను కలిగించుకుంది. ప్రతి సంవత్సరం మార్గశిరమాసంలో భరణి నక్షత్రం రోజున ఈ మహాదీపాన్ని అరుణాచల శిఖరంపై వెలిగించడం సంప్రదాయం. ఈ దీపం సాధారణ దీపం కాదు—5.6 అడుగుల ఎత్తు, 300 కిలోల బరువు గల విశాల పాత్రలో సుమారు 3,500 లీటర్ల నెయ్యితో, 1,000 మీటర్ల పొడవు ఉన్న కాడా వస్త్రాన్ని వత్తిగా ఉపయోగించి వెలిగిస్తారు. ఇంతటి భారీ దీపం మైళ్ల దూరం నుండి కనిపిస్తుంది.
పౌర్ణమి మరియు భరణి నక్షత్రం కలసి రావడంతో ఈసారి పౌర్ణమికి ముందురోజే దీపోత్సవం నిర్వహించారు. దాదాపు 10 రోజులపాటు ఈ దీపం భక్తులకు దర్శనం ఇస్తూ అరుణాచలం అంతటిని తేజస్సుతో నింపుతుంది. ఈ మహాఘట్టాన్ని చూడటానికి లక్షలాదిమంది భక్తులు దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి అరుణాచలానికి తరలి వస్తారు.
ఇక డిసెంబర్ 3, 4 తేదీల్లో అరుణగిరి పర్వతం ప్రదక్షిణ చేయడానికి 40 లక్షల మంది పైగా భక్తులు వస్తారని అంచనా. గిరిప్రదక్షిణ, దీపారాధన, శివనామస్మరణతో ఈ ప్రాంతం పవిత్రతతో నిండి ఉంటుంది.
పురాణాల ప్రకారం, బ్రహ్మ-విష్ణువులకు శివుడు అనంతజ్యోతి స్తంభరూపంలో దర్శనమిచ్చిన రోజునే తిరుకార్తీక పండుగ ఆరంభమైంది. అగ్ని జ్యోతి రూపంలో శివుడు ప్రత్యక్షమైన ప్రదేశమే ఈ తిరువణ్ణామలై గిరి అని శాస్త్రాలు చెబుతాయి. అందుకే ఈ క్షేత్రం “అరుణాచల జ్యోతి”గా భక్తుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయింది.