సమావేశంలో ముఖ్య అంశాలు:
•ఉప్పాడ మత్స్యకారుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం
•సముద్ర జలాల కాలుష్య సమస్యపై శాస్త్రీయ పరిశోధన
•మత్స్యకారులకు అదనపు ఆదాయం తెచ్చేలా ప్రణాళిక
•మత్స్యకారుల ఆదాయం పెంపు, మత్స్య సంపద వృద్ధి, తీర ప్రాంత రక్షణ, యువత, మహిళలకు ఉపాధి కల్పన లక్ష్యంగా యాక్షన్ ప్లాన్
•తమిళనాడు, కేరళకు అధ్యయనం కోసం ఉప్పాడ మత్స్యకారులతో ప్రత్యేక బృందాలు
•గత ప్రభుత్వ తప్పిదాలతో ప్రజాధనం వృథా
•చేసిన పనులే చేయాల్సిన దుస్థితిని అప్పటి పాలకులు తెచ్చారు
•ఉప్పాడ మత్స్యకారులతో ప్రత్యేకంగా సమావేశం అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
‘ప్రజా ధనం నుంచి ఖర్చు పెట్టే ప్రతి పైసాకు ప్రతిఫలం ఉండాలి. ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి పనిచేయాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా ప్రజా ధనాన్ని ఖర్చు చేశారు. అప్పటి ప్రభుత్వం ఓ ప్రణాళిక లేకుండా, సొంత ప్రాపకాల కోసం ఇష్టానుసారం చేసిన ఖర్చులతో నిధులు అక్కరకు రాకుండా పోయాయ’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు.
పోలవరం డయా ఫ్రం వాల్ ను గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లు మార్చి, రివర్స్ టెండర్లు అంటూ ఇష్టానుసారం నిర్మించడంతో ఎందుకు పనికిరాకుండా పోయిందనీ ఇప్పుడు దాన్ని పునర్నిర్మాణం చేయాల్సి వచ్చిందన్నారు. అలాగే ఉప్పాడలో నిర్మించిన మత్స్యకారుల జెట్టీ కూడా డిజైన్ల లోపం కారణంగా పనికిరాకుండా పోయింది, దానికి మళ్లీ రూ.80 కోట్లు ఖర్చయ్యే పరిస్థితిని తీసుకొచ్చారని చెప్పారు. చేసిన పనికే ప్రజాధనాన్ని మళ్లీమళ్లీ ఖర్చు చేసేలా అప్పటి పాలకులు పని చేశారని వివరించారు.
ఉప్పాడ మత్స్యకారులతో- 100 రోజుల ప్రణాళిక అమలు, భవిష్యత్తు కార్యాచరణ, ఆదాయం పెంపు అనే అంశాలపై బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. తమిళనాడు, కేరళలో విజయవంతంగా అమలు అవుతున్న సముద్ర ఉత్పత్తులతో అదనపు ఆదాయం విధానాలను పరిశీలించేందుకు ఉప్పాడ నుంచి 60 మందితో ప్రత్యేక బృందాన్ని అక్కడకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంపనున్నారు. సమావేశంలో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపే యాక్షన్ ప్లాన్ ను వారి సమక్షంలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియజేశారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘మత్స్యకారులకు సమస్య వస్తే నాకు వచ్చినట్లే. మా ఇంట్లోని వారికి సమస్య వచ్చినట్లే భావిస్తాను. అదే భావనతో సమస్యను పరిష్కరిస్తా. ఈ విషయాన్ని అక్టోబరు 9వ తేదీన ఉప్పాడ సెంటర్ నుంచి చెప్పాను. ఇప్పుడు అదే మాట మీద ఉన్నాను. సమస్య వస్తే రాజకీయాలకు అతీతంగా దాని పరిష్కారానికి ముందుకు వెళ్లేవాడిని. నాకు మీ సహకారం కావాలి. నన్ను శకించకండి.. నేను మీ వాడిని. మిగతా పార్టీల నాయకుల్లా సమస్య వస్తే బూతులు తిట్టడం, గొడవలు పెట్టడం చేయను. పరిష్కారం వచ్చేలా పని చేస్తాను. దాని కోసం పరితపిస్తాను.

•కాలుష్యానికి మూలం తెలియాలి:
సముద్రపు కాలుష్యం చాలా రకాలుగా ఉంటుంది. మత్స్యకారులు ఉప్పాడ తీరంలో కాలుష్య సమస్య నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే దీని మూలాలను శాస్త్రీయంగా వెతికేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఇప్పుడు డాక్టర్ జో కిజాకూడన్ బృందం రంగంలోకి దిగి ఉప్పాడ తీరంలో కాలుష్య సమస్యపై పూర్తిస్థాయి అధ్యయనం చేస్తుంది. దీని మూలాలు వెతికి, శాశ్వత పరిష్కారం వెతుకుదాం. మత్స్యకారులకు ఎలాంటి సమస్యా రాకుండా చూసుకునే బాధ్యతను నేను తీసుకుంటాను. పరిశోధన బృందానికి మత్స్యకారులు తగిన విధంగా సహకరించాలి. వారు తీర ప్రాంతంలో అంతా తిరిగి, సముద్రంలోకి వెళ్లి మరీ కాలుష్యానికి అసలు కారణాలను తెలుసుకుంటారు.
•సమస్యను మర్చిపోలేదు:
అక్టోబరు 9వ తేదీన ఉప్పాడ వేదికగా 100 రోజులు గడువు ఇవ్వాలని మత్స్యకారులను కోరాను. అప్పటి నుంచి నాతోపాటు నా కార్యాలయ అధికారులు దీనిపై కూలంకషంగా పని చేస్తున్నారు. సమస్య పరిష్కార దిశగా, మత్స్యకారులకు కొత్త భరోసా ఇచ్చే దిశగా ముందుకు వెళ్తున్నాం. సమస్యను నేనెప్పుడూ మర్చిపోలేదు. మత్స్యకారులు మారుతున్న కాలంతో మరింత వేగంగా వారి బతుకులను బంగారుమయం చేసుకునేందుకు వివిధ రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు అవుతున్న పద్ధతులను అవలంబించాలి. దీనికోసం ఉప్పాడ మత్స్యకారుల నుంచి ప్రత్యేకంగా బృందాలను తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు పంపుతున్నాం. అక్కడి విధానాలను అవగతం చేసుకోవాలి.
దానికి ప్రభుత్వం కూడా మీకు తగిన విధంగా సహకరిస్తుంది. అక్కడ పద్ధతులను క్షణ్ణంగా తెలుసుకోవాలి. అదనపు ఆదాయ మార్గాల మీద దృష్టి సారించాలి. ఉప్పాడలోని 7200 మంది మత్స్యకారులు, 25,600 మంది వారి కుటుంబ సభ్యులకు జీవన భృతి రెట్టింపు అవ్వాలి అన్నదే లక్ష్యం’’ అన్నారు.
ఈ సమావేశంలో కాకినాడ జిల్లా కలెక్టర్ శ్రీ షణ్మోహన్ సగిలి, సెంట్రల్ మెరైన్ ఫిషరీష్ రీసెర్చ్ ఇన్సిట్యూట్ కు చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రిన్సిపల్ సెంటిస్ట్ డాక్టర్ జో కిజాకుడాన్, ఫిషరీష్ అడిషనల్ డైరెక్టర్ శ్రీ చంద్రశేఖర్, మెరైన్ షిఫరీష్ జాయింట్ డైరెక్టర్ శ్రీ సురేష్, కాకినాడ జిల్లా ఫిషరీష్ అధికారి శ్రీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
యాక్షన్ ప్లాన్ లోని కొన్ని ముఖ్యాంశాలు:
- ఉప్పాడ తీర ప్రాంత కాలుష్యానికి అసలు కారణాలు.. దాని నివారణకు తీసుకోవల్సిన చర్యలకు శాస్త్రీయ పరిష్కారం దిశగా వేగంగా అడుగులు. ఐసీఏఆర్ రీజనల్ సెంటర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ జో కిజాకుడాన్ బృందంతో ఉప్పాడ తీరంలోని 20 ప్రాంతాల్లో ప్రత్యేకంగా పరిశోధనలు, పరిష్కార మార్గాలు చూపేలా ప్రణాళికలు. తక్కువ సమయంలోనే ఫలితాలు సాధించేలా కృషి.
- సముద్రంలో చేపలు పట్టుకోవడానికి గతంలో కేవలం 12 నాటికల్ మైళ్ల వరకు మాత్రమే మత్స్యకారులకు అనుమతి ఉండేది. ఇప్పుడు 200 నాటికల్ మైళ్ల వరకు అనుమతి లభించింది. డీప్ సీ ఫిషింగ్ అనుమతి ద్వారా మత్స్యకారులకు అదనపు ఆదాయం లభించనుంది.
- రాష్ట్రంలో మొదటిసారి ఉప్పాడ తీరంలో 50 వేల పండుగప్ప పిల్లలను ఇటీవల విడిచిపెట్టడం జరిగింది. భవిష్యత్తులో టైగర్ రొయ్య పిల్లలను కూడా ఇదే విధంగా విడిచిపెట్టి మత్స్య సంపదను తీర ప్రాంతంలో గణనీయంగా పెంచేలా ముమ్మర ప్రయత్నం.
- కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక పథకం ద్వారా కోనపాపపేటలో బహుళార్ధసాధక కమ్యూనిటీ హాళ్లు, ఆర్.ఓ ప్లాంటు, చేపలు ఎండబెట్టుకోవడానికి 3 రకాల ప్లాట్ ఫాంల నిర్మాణం. వేటకు వెళ్లే వారిని ట్రాక్ చేసేందుకు జీపీఎస్ పరికరాలు, ఐస్ బాక్సులను అందజేత.
మత్స్యకారులకు అదనపు ఆదాయ మార్గాలు:
- తమిళనాడులో చెన్నై హార్బర్ దగ్గరగా, తిరువత్రియార్ కుప్పం తీరంలో విజయవంతంగా అమలు అవుతున్న ఆర్టిఫిషియల్ కోరల్ రీఫ్ ( కృత్రిమ పగడపు దిబ్బ)లను ఉప్పాడ తీరంలోనూ ఏర్పాటు. 1500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఒక టన్ను సామర్థ్యంతో పగడపు దిబ్బలు ఏర్పాటు ద్వారా 300 రకాల సముద్ర జాలాలను ఆకర్షించడం సాధ్యం అవుతుంది. వీటిలో 50 రకాల సముద్ర చేపలు మత్స్యకారులకు వాణిజ్యపరంగా ఉపయోగపడతాయి. ఈ రకమైన సముద్ర వ్యవసాయం ద్వారా ఏడాదిలో రూ.2 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా.
- సముద్రపు నాచు (సీ వీడ్) వ్యవసాయం అనే కొత్త పద్ధతి ద్వారా ఉప్పాడ మత్స్యకారుల ఆదాయానికి కొత్త మార్గం చూపిస్తాం. సముద్రపు నాచును ప్రాసెస్ చేయడం ద్వారా పోషక, ఔషధ గుణాలున్న ఆహారం, కాస్మోటిక్స్, మందులు, బయోఫ్యూయల్స్, ఎరువుల తయారీలో అది ప్రధాన మూలకంగా పనికొస్తుంది. దీనికి మార్కెట్ చాలా అధికంగా ఉంది. ఇది భవిష్యత్తులో సముద్ర ఆదాయ విప్లవానికి నాంది పలుకుతుంది.
- సీ గ్రాస్ బెడ్ పునరుద్ధరణ ద్వారా తీర ప్రాంత పర్యావరణానికి రక్షణ ఏర్పాటు చేయడం ప్రధానం. సముద్ర జీవులను రక్షించుకోవడం, జీవ వైవిధ్యం పెంపొందించుకోవడం అనేది భవిష్యత్తుకు చాలా అవసరం.
- ఉప్పాడ తీర ప్రాంత రక్షణకు సీ ప్రొటెక్షన్ వాల్ ప్రధానం. దీని కోసం రూ323 కోట్లతో ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. ఉప్పాడ కోత నివారణకు రక్షణ గోడ అవసరాన్ని కేంద్ర హోమంత్రిత్వ శాఖ దృష్టికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్లి నిధుల కోసం ప్రత్యేకంగా మాట్లాడనున్నారు.
- సముద్రంలో పట్టుకున్న చేపలను ప్రాసెస్ చేసేందుకు, వివిధ రకాల ఉత్పత్తులుగా తయారు చేసేందుకు ఎంఎస్ఎంఈల ద్వారా మెరుగైన అవకాశాల కల్పన. తగిన రాయితీలు. అలాగే పిఠాపురంలో ప్రత్యేకంగా నిర్మించబోయే 5 అంతస్థుల వాణిజ్య భవన సముదాయంలో 50 శాతం స్థలాన్ని మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా కేటాయింపు.
- మత్స్యకార యువత పోలీసు, రక్షణ సంబంధిత రంగాల్లో ఉద్యోగాల కోసం పోటీ పరీక్షల్లో పాల్గొనేలా శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా వారి కోసం అకాడమీ ఏర్పాటు.