ఈ రోజు దశపాప హర దశమి. జ్యేష్ఠ శుక్లపక్ష దశమి రోజు, సహజంగా మనుష్యులుచేసే పది రకాల పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి అనుకూలమైన రోజు అని, ఈరోజు దశ పాపహర దశమి అని పిలుస్తారు. స్కంధ పురాణం, మనుస్మృతి ప్రకారం పదిరకాల పాపాలు ఏమిటంటే, మూడు శరీరంతో చేసేవి (1.ఇతరుల ఆస్తిని ఆక్రమించుకోవడం,2.చట్టవిరుద్ధమైన విధ్వంసం చేయడం,3.ఇతరుల భార్యల తో సంగమించడం), నాలుగు మాటల ద్వారా చేసే పాపాలు (1.అనాలోచితంగా,ఆవేశంగా మాట్లాడటం 2.పరుల గురించి వారి పరోక్షంలో చెడుగా మాట్లాడటం 3. అబద్ధాలు అలవాటుగా మాట్లాడటం 4.అసందర్భంగా అనుచితంగా గా మాట్లాడటం)… మూడు మానసికంగా చేసే పాపాలు (1.ఇతరుల ఆస్తులను ఆక్రమించుకొవాలని ఆలోచించడం 2.ఇతరులకు హాని జరగాలని కోరుకోవడం 3. నాస్థికతత్వంతో దైవ దూషణ చేయడం) (ఇందులో నాస్తికత్వం పాపం కాదు,అవగాహన,విషయ పరజ్ఞానం లేకుండా దైవదూషణ చేయడం పాపం, పురాణాల్లో కూడా నాస్థికులు ఉన్నారు,కానీ దైవదూషణ చేయకుండా హేతుబద్ధంగా ఆలోచించిన వారిలో జాబాలి అనే ఋషి ఒకరు).
ఇటువంటి పాప ప్రక్షాళన కోసం ఈరోజు భక్తులు గంగానదిలో స్నానం చేస్తూ, ఇంతవరకు తాము చేసిన పాపాలని క్షమించి ప్రక్షాళన చేయాలని, భవిష్యత్తులో మరలా పొరపాట్లు జరగకుండా ఉండేవిధంగా మనః స్థైర్యం ఇవ్వాలని గంగాదేవిని ప్రార్థిస్తారు. దీనినే గంగా భగవతీ వ్రతం అంటారు. గంగా జలం అందుబాటులో లేనివారు, వారి ఇంటిలో స్నానానికి ఉపయోగించే నీటినే గంగా జలంగా భావించి, సంకల్పం చెప్పుకొని పాప ప్రక్షాళన చేసుకోవచ్చు.