హనుమాన్ చాలీసా పారాయణం అనేది భక్తిలో అత్యంత శక్తివంతమైన సాధనలలో ఒకటి. హనుమంతుడు భూతప్రేత పిశాచాదులను దూరం చేసి భక్తులకు రక్షణనిచ్చే దైవంగా ప్రసిద్ధి. అందుకే చాలామంది రోజూ చాలీసా పఠనం చేస్తారు. అయితే పారాయణంలో కొన్ని నియమాలు, జాగ్రత్తలు పాటించకపోతే పఠనం ఫలితం తగ్గిపోతుందని శాస్త్రాలు, పండితులు చెబుతున్నారు.
మొదటగా చాలీసాను బిగ్గరగా చదవడం మంచిది కాదు. అలా చేస్తే ఉచ్చారణ దోషాలు వచ్చే ప్రమాదం ఉంది. ఉచ్చారణలో వచ్చిన చిన్న తప్పు కూడా ద్విపద యొక్క శక్తిని తగ్గిస్తుందని భావిస్తారు. కనుక మృదువైన, నెమ్మదైన స్వరంతో, ప్రతి పదం అర్థం గ్రహిస్తూ పారాయణం చేయాలి. చాలీసా పఠనం అంటే కేవలం చదివేయడం కాదు, ప్రతి శ్లోకంలోని భావాన్ని మనసులో నింపుకోవడం.
పారాయణ సమయంలో త్వరగా ముగించాలని ప్రయత్నించడం ఫలితాన్ని తగ్గిస్తుంది. సమయం తగ్గినా కూడా శ్రద్ధతో, ఏకాగ్రతతో చదవడం తప్పనిసరి. అలాగే శరీరం, మనసు పవిత్రంగా ఉండడానికి శుభ్రమైన దుస్తులు ధరించడం, ఆవునెయ్యి దీపం వెలిగించడం ఉత్తమం. దీపం ముందు కూర్చొని పఠిస్తే మనసు సహజంగానే ఏకాగ్రతను పొందుతుంది.
దిక్సూచి పరంగా చూసుకుంటే, పండితులు తూర్పు లేదా దక్షిణ దిశ వైపు ముఖంగా కూర్చోవడంనే శ్రేయస్కరంగా సూచిస్తున్నారు. ఈ దిశల్లో పఠనం చేయడం శాస్త్రీయంగా, ఆధ్యాత్మికంగా శక్తిని పెంచుతుందని చెబుతారు.
ఈ నియమాలను పాటిస్తూ హనుమాన్ చాలీసా చదివితే మనసు ప్రశాంతమై, శక్తి పెరిగి, దైవ అనుగ్రహం మరింత లభిస్తుంది.