తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025’ సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటైన ఈ వేదికపై రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మధ్యాహ్నం 1:30 గంటలకు అధికారికంగా సమ్మిట్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. దేశ–విదేశాల నుంచి పారిశ్రామిక వేత్తలు పెద్ద సంఖ్యలో హాజరవడంతో వేదిక సందడియగా మారింది.
కార్యక్రమానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి స్టాల్స్‌ను పరిశీలించి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం సమ్మిట్ వేదిక వద్ద రూపొందించిన తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ముఖ్యమంత్రి కీలక ప్రసంగం ప్రారంభమైంది. రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ఈ సమ్మిట్ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.
సమ్మిట్ తొలి రోజున ప్రపంచప్రసిద్ధ ఆర్థికవేత్తలు, నోబెల్ బహుమతి గ్రహీతలు పాల్గొని ప్రసంగించనున్నారు. వీరిలో అభిజిత్ బెనర్జీ, కైలాష్ సత్యార్థి, వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ సీఈఓ జెరెమీ జుర్గెన్స్, బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్–షా, ట్రంప్ మీడియా & టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్వైడర్ ముఖ్యులు. పెట్టుబడులను ఆకర్షిస్తూ తెలంగాణను తదుపరి దశకు తీసుకెళ్లే కీలక కార్యక్రమంగా ఈ సమ్మిట్ నిలువనుంది.