ఇంటి వద్ద నుంచే ఆదాయం పొందాలనుకునే మహిళలకు ఇది ఒక చక్కటి వ్యాపార ఆలోచన. రోజుకు కేవలం నాలుగు గంటల సమయం కేటాయిస్తే సరిపోతుంది… నెలకు మంచి మొత్తంలో ఆదాయం వచ్చే అవకాశం ఉన్న హోమ్ స్టైల్ బిర్యానీ బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవలి కాలంలో ఇంట్లో తయారయ్యే ఫుడ్‌కు డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా ఆఫీస్‌కు వెళ్లే ఉద్యోగులు, బ్యాచిలర్స్, హాస్టల్‌లో ఉండేవారు, కుటుంబాలు… అందరూ ఇంటి రుచితో చేసిన బిర్యానీని ఇష్టంగా తింటున్నారు. బయట హోటళ్లతో పోలిస్తే ఇంటి వద్ద తయారైన బిర్యానీ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా రుచికరంగా ఉంటుందనే నమ్మకం వినియోగదారుల్లో పెరిగింది. ఈ ట్రెండ్‌ను అవకాశంగా మలచుకుంటే మంచి లాభాలు పొందవచ్చు.
ఈ బిజినెస్‌ను ప్రారంభించడానికి పెద్ద పెట్టుబడి అవసరం లేదు. ఇంట్లోనే ఉన్న వంట సామగ్రితో పాటు ఒక బిర్యానీ హండి, స్టవ్, ప్యాకింగ్ బాక్సులు ఉంటే సరిపోతుంది. ఉదయం లేదా మధ్యాహ్నం కొన్ని గంటలు బిర్యానీ తయారీకి కేటాయిస్తే చాలు. ముందుగా పరిచయస్తులు, కాలనీ వాళ్లు, ఆఫీస్ ఉద్యోగులను లక్ష్యంగా పెట్టుకుని ఆర్డర్లు తీసుకోవచ్చు. వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తే మరింతగా కస్టమర్లు పెరుగుతారు.
ఖర్చుల విషయానికి వస్తే… ఒక్క ప్లేట్ బిర్యానీకి చికెన్, బియ్యం, మసాలాలు, గ్యాస్, ప్యాకింగ్ కలిపి సుమారు 50 నుంచి 60 రూపాయల వరకు ఖర్చవుతుంది. అదే ప్లేట్‌ను 140 నుంచి 150 రూపాయల ధరకు విక్రయిస్తే మంచి మార్జిన్ లభిస్తుంది. రోజుకు కనీసం 20 ప్లేట్లు అమ్మగలిగితే సుమారు 2,000 రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం 10 రోజుల్లోనే 20 వేల రూపాయల వరకు సంపాదించవచ్చు.
నెల మొత్తం లెక్క వేసుకుంటే 50 వేల నుంచి 60 వేల రూపాయల వరకు నికర ఆదాయం వచ్చే అవకాశం ఉంది. రుచి, శుభ్రత, సమయానికి డెలివరీపై శ్రద్ధ పెట్టగలిగితే కస్టమర్లు స్వయంగా ప్రచారం చేస్తారు. చిన్న స్థాయి నుంచి ప్రారంభించి క్రమంగా ఆర్డర్లు పెంచుకుంటే… ఇది మహిళలకు స్థిరమైన ఆదాయం ఇచ్చే లాభదాయకమైన హోమ్ బిజినెస్‌గా మారుతుంది.