ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం మహా జాతర ప్రతి రెండేళ్లకోసారి తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ జాతరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి కోటికి పైగా భక్తులు తరలివచ్చి గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుంటారు.
భక్తులు ముందుగా జంపన్నవాగులో పవిత్ర స్నానాలు ఆచరించి అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తూ బెల్లం, ఒడిబియ్యం, చీరలు, సారెలు సమర్పించి తమ కుటుంబాలకు సుఖసంతోషాలు కలగాలని వేడుకుంటారు. జాతర రోజుల్లో మేడారం పరిసర ప్రాంతాలు కోళ్ల, మేకల విక్రయాలతో కళకళలాడుతుంటాయి. అమ్మవార్లకు ఎదుర్కోవాలని కోళ్లు, మేకలను సమర్పించే సంప్రదాయం ఉండటంతో భారీ డిమాండ్ ఏర్పడుతుంది.
కొన్ని సందర్భాల్లో ఒక్కో కోడి రూ.500 వరకు అమ్ముడుపోవడం గమనార్హం. గత జాతరలో డిమాండ్ అధికంగా ఉండటంతో కోళ్లు, మేకలు పూర్తిగా అమ్ముడై ఖాళీ షాపులు దర్శనమిచ్చాయి. ఈ నేపథ్యంలో మేడారం మహా జాతరలో కోళ్ల దుకాణాల ఏర్పాటుకు ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రా దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ నెల 15లోపు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు, స్థానిక గిరిజనులు, గిరిజన మహిళలకు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. అవసరమైన పత్రాలతో ఏటూరు నాగారం లేదా మేడారం ఐటీడీఏ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని, పరిశీలన అనంతరం ఈ నెల 22న లైసెన్సులు జారీ చేస్తామని పేర్కొన్నారు.