ఆశ్వయుజ మాస శుద్ద పాడ్యమి నుంచి తొమ్మిదిరోజులపాటు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. తెలంగాణకే ప్రత్యేకమైన ఈ పండుగ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచింది. ప్రకృతి సంబంధమైన ఈ పండుగను ఎందుకు జరుపుకుంటాం. దాని వెనుకనున్న కారణాలేంటి అనే విషయాల గురించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకొని తీరాలి. ముందుగా మనం తెలుసుకోవలసింది బతుకమ్మ పండుగను ఎలా చేస్తారు అన్నదే. మహిళలు, పిల్లలు అందరూ కలిసి రంగు రంగుల పువ్వులను తీసకొచ్చి వాటిని త్రికోణాకృతిలో పేరుస్తారు. ఇలా అందంగా ఒద్దికగా అలంకరించిన బతుకమ్మల చుట్టూ మహిళలు తిరుగుతూ పాటలు పాడతారు. బతుకమ్మ పండుగ ఒక్కరోజుకు సంబంధించిన పండుగ కాదు. దసరా నవరాత్రోత్సవాల మాదిరిగానే తొమ్మిదిరోజులపాటు బతుకమ్మ పండుగను నిర్వహించి పదోరోజున సద్దుల బతుకమ్మతో వేడుకలను ముగిస్తారు.
మొదటిరోజు అంటే సెప్టెంబర్ 22న ఎంగిలిపూల బతుకమ్మతో ఈ పండుగ మొదలౌతుంది. దీన్ని పెత్రామస పండుగ అని కూడా పిలుస్తారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేధ్యం తయారు చేసి బతుకమ్మకు నివేదిస్తారు. రెండోరోజు పండుగను అటుకుల బతుకమ్మగా పిలుస్తారు. సిప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేధ్యం సమర్పిస్తారు. ఇక మూడోరోజున ముద్దపప్పు బతుమ్మ పండుగను నిర్వహిస్తారు. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేధ్యం తయారు చేసి బతుకమ్మకు సమర్పిస్తారు. నాలుగో రోజున నానే బియ్యం బతుకమ్మను నిర్వహిస్తారు. ఈరోజు నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేధ్యం చేసి బతుకమ్మకు నివేదిస్తారు. ఐదో రోజున అట్ల బతుకమ్మను నిర్వహిస్తారు. ఈరోజు బతుకమ్మకు అట్లు లేదా దోశలు నైవేధ్యంగా సమర్పిస్తారు. ఆరోరోజున అలిగిన బతుకమ్మ పండుగను నిర్వహిస్తారు. ఈరోజు అమ్మవారికి ఎటువంటి నైవేధ్యం సమర్పించరు. ఏడో రోజున వేపకాయల బతుకమ్మ పండుగ చేస్తారు. బియ్యంపిండి బాగా వేయించి వేపపండ్ల ఆకారంలో తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
ఎనిమిదోరోజున నిర్వహించే వెన్నముద్దల బతుకమ్మకు నువ్వులు, వెన్న, బెల్లం కలిపి నైవేధ్యంగా సమర్పిస్తారు. తొమ్మిదోరోజున సద్దుల బతుకమ్మకు ఐదు రకాలైన నైవేద్యాలు సమర్పిస్తారు. తెలంగాణలో బతుకమ్మ పండుగను జరుపుకోవడం కోసం ఆడపడుచులు అత్తవారింటినుంచి పుట్టింటికి వస్తారు. తొమ్మిదిరోజులపాటు పుట్టినింట్లో ఈ పండుగను జరుపుకొని, దసరా పండుగను చూసుకొని తిరిగి అత్తారింటికి వెళ్లిపోతారు. ఒకప్పుడు మహమ్మారి నుంచి పల్లెలను బతికించినందుకు బతుకమ్మ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. అనాదిగా వస్తున్న ఈ ఆనవాయితీని నేటితరం ప్రజలు కొనసాగిస్తున్నారు. రాబోయే తరం కూడా ఈ పండుగను ఇలానే కొనసాగించాలని కోరుకుందాం.