ఇంటి మెట్లకింద టాయిలెట్‌ నిర్మిస్తున్నారా… ఈ ఇబ్బందులు తప్పవు

Building a Toilet Under the Staircase at Home? These Problems Are Unavoidable
Spread the love

ఇంటి నిర్మాణం విషయంలో తప్పనిసరిగా వాస్తును అనుసరించే నిర్మించుకోవాలి. వాస్తు ప్రకారం కాకుండా మనకు నచ్చిన రీతిలో ఇంటిని నిర్మించుకుంటే ఫలితాలు కొంత వ్యతిరేకంగా ఉంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంటి నిర్మాణంలో కొంతమంది స్థలం లేక టాయిలెట్‌ను మెట్లకింద నిర్మిస్తుంటారు. మెట్లకింద టాయిలెట్‌ను నిర్మించడం వలన పలు ఇబ్బందులు తలెత్తుతాయని పండితులు చెబుతున్నారు. మెట్లకింద టాయిలెట్‌ల నిర్మాణం ఎందుకు నిషిద్దమంటే… మెట్లు ఒకదానిపై ఒకటిగా ఎత్తుగా నిర్మిస్తారు. వాటికింద టాయిలెట్‌లను పెట్టడం అంటే మలమూత్రాదులు ఉన్న స్థలాన్ని శిరస్సుపైకి తీసుకెళ్లడమే అవుతుంది. ఇది వాస్తు దృష్ట్యా శుద్ధి ధర్మానికి వ్యతిరేకమని చెబుతారు. మెట్లకింద ఎలాంటి హానికరమైన స్థలాలు ఉన్నా అది ఆ ఇంటికి మంచిది కాదు. ప్రతికూల శక్తులను ఇంట్లోకి ప్రవహించేలా చేస్తుంది. మెట్లను గురుస్థానం లేదా బ్రహ్మస్థానంపై కడతారు. ఇలాంటి మెట్ల కింద శోచాలయాన్ని నిర్మిస్తే అది పవిత్రతను దెబ్బతీస్తుంది. ఫలితంగా వాస్తు దోషాలు ఏర్పడతాయి. ఇటువంటి వాస్తు దోషాల కారణంగా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఉత్పన్నమౌతాయని వాస్తు పండితులు చెబుతున్నారు.

మెట్లకింద స్థలాన్ని టాయిలెట్‌గా కాకుండా మరేవిధంగా వాడుకోవాలి అంటే ఆ స్థలాన్ని ఖాళీగా వదిలిపెట్టడం లేదా స్టోరేజ్‌గా మాత్రమే వాడుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో టాయిలెట్‌ను ఎప్పుడైనా తూర్పు ఉత్తరం మూలల నుంచి దూరంగా అంటే వాయువ్య ప్రాంతంలో లేదా దక్షిణ ప్రాంతంలో మాత్రమే నిర్మించుకోవాలి. ఈ దిశలు టాయిలెట్‌ నిర్మాణానికి అనుకూలంగా ఉంటాయి. టాయిలెట్‌ గుంతలు వలన ఇబ్బందులు లేకుండా ఉంటాయి. వాయువ్య ప్రాంతం గాలి వీచేందుకు అనుకూలంగా ఉంచుకుంటాం కాబట్టి ఆ ప్రాంతంలో టాయిలెట్‌ను నిర్మించుకోవడం వలన టాయిలెట్‌లోకి గాలి ఫ్లో అవుతుంది. ఒకవేళ ఇప్పటికే మెట్లకింద టాయిలెట్‌లను నిర్మించి ఉంటే దోష పరిహారం కోసం ఏం చేయాలి అనే దానికి కూడా పలు సమాధానాలున్నాయి. వాస్తు దోష నివారణ కోసం పిరమిడ్‌ ఆకృతిని ఏర్పాటు చేయాలి. గోమయంతో నిత్యం ఇంటిని శుద్ధి చేసుకోవాలి. గంగాజలంతో లేదా తులసి నీటితో ఇంటిని శుద్ధి చేస్తుండాలి. ఇంట్లో నిత్యం దీపం వెలిగిస్తూ ఉండటం వలన కూడా వాస్తు దోషాల నుంచి బయటపడొచ్చు. వీలైనంత వరకు మెట్లకింద టాయిలెట్‌ను నిర్మించకుండా ఉంటే మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *