శివలింగం రంగులు మారడం సహజం. శివలింగాన్ని తయారు చేసిన రాయిని బట్టి అది రంగులు మారుతూ ఉంటుంది. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ శివలింగం ఒక నిమిషం వెండిరంగులో ఉంటే మరో నిమిషంలో బంగారు వర్ణంలోకి మారిపోతుంది. ఎందుకు ఇలా మారుతుంది అని చెప్పడానికి ప్రత్యేకమైన కారణాలు ప్రత్యేకంగా తెలియదు. అయితే, ఈ శివలింగాన్ని స్వయంగా భక్తులే అభిషేకం చేస్తారు. అయితే, అభిషేకం గర్భాలయంలోకి వెళ్లి చేయకుండా మండపంలో నుంచే చేసే విధంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు.
శివాలయంలో మండపంలోని స్థంభాల కింద శివలింగాలను ఏర్పాటు చేశారు. ఈ శివలింగాలకు భక్తులే స్వయంగా గంగాజలంతో అభిషేకం చేస్తారు. అక్కడి నుంచి ఆ జలం భూగర్భంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మార్గాల ద్వారా ప్రయాణించి గర్భగుడిలోని శివలింగంపై ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన జల్లెడ నుంచి శివుడిపై పడతాయి. ఆలయంలోని అర్చకులు శివలింగాన్ని తడిమినపుడు ఒక సమయంలో వెండిరంగులోనూ, మరోసమయంలో బంగారు వర్ణంలోనూ మారిపోతుంది.
ఈ ఆలయంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడే భూగర్భంలో శ్రీవేంకటేశ్వరుడు కూడా కొలువై ఉంటాడు. అక్కడ స్వామివారు ఎప్పుడు వెలిశారు, చరిత్ర ఏమిటి అన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఇటీవల కాలంలో ఈ దేవాలయానికి సంబంధించిన విషయాలను కొందరు భక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటంతో ప్రపంచానికి తెలుస్తున్నది. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది అని చెప్పలేదు కదా. అక్కడికే వస్తున్నా. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇళ్లపల్లి అనే గ్రామంలో ఉంది. విజయవాడ, విశాఖ నుంచి సామర్లకోటకు రైలు మార్గం అందుబాటులో ఉండటంతో సులభంగా ఆలయాన్ని సందర్శించవచ్చు.