దసరా శరన్నవరాత్రులు రోజునుంచి ప్రారంభం అవుతున్నాయి. నవ దుర్గా సాంప్రదాయం ప్రకారం ఈరోజు భక్తులు దుర్గాదేవిని శైలపుత్రి అవతారంలో పూజిస్తారు. శైలపుత్రి అంటే పర్వత రాజు కుమార్తె అని అర్థం. సతీదేవి, పార్వతీ, హేమావతి,భవానీ అనే పేర్లతో కూడా పిలుస్తారు. ప్రకృతి రూపంలో ఉండే ఈ శక్తి నంది వాహనం మీద కూర్చొని ఒకచేతిలో త్రిశూలం, మరొక చేతిలో పూవుతో, తలపై అర్ధ చంద్రుడిని ధరించిన రూపంతో ఉంటుందని పురాణ వచనం. నవ దేవీ సాంప్రదాయం ప్రకారం ఈరోజు భక్తులు శ్రీ బాలా త్రిపురసుందరి దేవిని పూజిస్తారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనది.
శ్రీబాలామంత్రం సమస్త దేవీ మంత్రాల్లో విశిష్టమైనవిగా చెబుతారు. శ్రీవిద్యోపాసకులు మొదట బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరీదేవి కొలువై ఉండే శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే దేవత బాలా త్రిపుర సుందరి. ఆమె అనుగ్రహం పొందితేనే మహా త్రిపుర సుందరీ దేవి అనుగ్రహాన్ని పొందగలరు. పూర్వం హేమకీర్తి రత్నావళీ అనే రాజదంపతులకు ఇంద్రకీలాద్రిపై బాలా త్రిపుర సుందరీదేవి రూపంలో దుర్గాదేవి దర్శనం ఇచ్చారని, ఆ దర్శనం తరువాతే ఆ రాజదంపతులకు సంతానం కలిగిందని పెద్దలు చెబుతున్నారు. ఇంద్రకీలాద్రిపై నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేవీ శరన్నవరాత్రులు ఇంద్రకీలాద్రిపై నిర్వహించడానికి చారిత్రక ప్రాధాన్యత ఉంది. ఇంద్రకీలాద్రి పర్వతం గురించి స్కాందపురాణంలోని సహ్యద్రి ఖండంలో ఉంది.
కృష్ణానదికి ఉత్తర తీరంలో స్వర్ణమయమైన కీల పర్వతం ఉందని స్కాందపురాణం పేర్కొంది. అంతేకాదు, కీలుడు అనే రాక్షసుడు దుర్గాదేవి గురించి తపస్సుచేశాడని, అమ్మవారు అతని తపస్సుకు మెచ్చి ఏం కావాలో కోరుకోమనగా, ఆ రాక్షసుడు అమ్మవారు స్వయంగా తన హృదయంలోనే నివశించాలని కోరాడట. కీలుడి ఇచ్చిన మాట ప్రకారం అమ్మవారు కృతయుగంలో మహిషాసురుడిని సంహరించిన అనంతరం మహిషాసుర మర్దిని రూపంతో రాగా, కీలుడు కృష్ణానది ఒడ్డున పర్వత రూపంలో మారిపోయాడు. అమ్మవారు కీల పర్వతంపై వెలిసిన తరువాత ఇంద్రాది దేవతలు వచ్చి నిత్యం పూజలు చేశారని, అప్పటి నుంచి ఈ కీలాద్రి పర్వతానికి ఇంద్రకీలాద్రి పర్వతంగా పేరు వచ్చిందని పెద్దలు చెబుతున్నారు.