ఢిల్లీ సుల్తాను కూతురు దక్షిణాదిన బీబీనాంచారిగా ఎలా ప్రసిద్ది పొందింది. ఢిల్లీ నుంచి ఆమె దక్షిణాదికి ఎందుకు వచ్చింది? రాజకుమారికి, మేల్కొటేలోని సంపత్కుమారుడికి ఉన్న అనుబంధం ఏమిటి? మేల్కొటే విగ్రహం కథేంటి… ఇప్పుడు తెలుసుకుందాం.
పిలిచినంతనే పలికే దైవం ఆ వైకుంఠవాసుడు. వైకుంఠవాసుడు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇస్తుంటాడు. అటువంటి వాటిల్లో ఒకటి సంపత్కుమారుడు. ఢిల్లీ సుల్తాను దక్షిణ దేశంపై దండెత్తి ఆలయాలను కొల్లగొట్టి విగ్రహాలను ఎత్తుకెళ్లాడు. అటువంటి వాటిల్లో ఒకటి కర్ణాటకలోని మేల్కొటే కూడా. ఇక్కడి సంపత్కుమారుడిని కూడా ఢిల్లీ సుల్తాను ఎత్తుకెళ్లాడు. ఆ విగ్రహం కోసం రామానుజుల వారు కాలినడకన ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ సుల్తాను రామానుజులవారిని చూసి ఆశ్చర్యపోయి ఆతిథ్యం ఇచ్చారు. విగ్రహం కోసం ఇంత దూరం వచ్చారా. అది అంత గొప్ప విగ్రహమా అని అడుగుతాడు.
ఆ విగ్రహాన్ని తానెప్పుడూ చూడలేదని, కాని, దానిని గుర్తించడం సులభమని అంటాడు. ఢిల్లీ సుల్తాను, రామానుజులు, ఆయన శిష్యబృందం కలిసి ఓ గదిలోకి వెళ్తారు. అక్కడ విగ్రహాలు కుప్పగా పోసి ఉంటాయి. ఇందులో ఏదైనా ఉందేమో చూడండి అంటాడు. వెంటనే రామానుజులు సంపత్కుమారా…రా తండ్రి రా… అని పిలుస్తాడు. పలుమార్లు బిగ్గరగా పిలిచినా ఎటుంటి అలికిడి ఉండదు. విగ్రహాలు కదలవండి అని సుల్తాను చెబుతాడు. ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా విగ్రహాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తాడు రామానుజులు. కొన్ని విగ్రహాలు కరిగించామని, ఒకటి తన కూతురు వద్ద ఉందని, ఆట వస్తువుగా తన వద్దనే ఉంచుకుందని అంటాడు.
వందేళ్లు ఎలా బతకాలి…జపాన్ వాసులు చెబుతున్న సత్యాలు
వెంటనే తాను ఆ విగ్రహాన్ని చూడాలని చెప్పగా, భోజనం సమయంలో అంతఃపురానికి తీసుకెళ్తాడు. అక్కడ గదిలోకి వెళ్లిన రామానుజులు బిగ్గరగా సంపత్కుమారా రా తండ్రి రా అని పిలుస్తాడు. శిష్యలు అప్పటికే విష్ణుసహస్రనామం చదువుతుంటారు. రామానుజులవారు అలా పిలవగానే లోపల ఉన్న విగ్రహం ఘల్లు ఘల్లుమని గజ్జెల సవ్వడి చేస్తూ వస్తుంది. ఆ దృశ్యాన్ని చూసి ఢిల్లి సుల్తాన్ ఆశ్చర్యపోతాడు. విగ్రహాన్ని రామానుజులవారికి అప్పగిస్తాడు. అయితే, శిష్యుల్లో ఒకరు ఆ విగ్రహం నుంచి కన్నీరు కారడం చూస్తాడు. తనను రాజకుమారి ఎంతో అపురూపంగా చూసుకుందని, ఆమెను వదిలి రావడం కష్టంగా మారిందని చెబుతాడు. ఈ విషయాన్ని శిష్యుడు రామానుజులవారికి చెప్పగా, మేల్కొటేలో విగ్రహం పునః ప్రతిష్టాపన సమయంలో ఢిల్లీ సుల్తానుకు కూడా కబురు పంపుతాడు.
రామానుజునుల కబురు విన్న ఢిల్లీ సుల్తాను తన పరివారంతోనూ, తన కుమార్తెతోనూ కలిసి కర్ణాటక వస్తాడు. స్వామివారి పునఃప్రతిష్ట వైభవాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. కానీ, సుల్తాను కూతురు స్వామివారి విగ్రహాన్ని చూస్తూ, ఆ విగ్రహంపై మరింత ప్రేమను పెంచుకుంటుంది. అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుంటుంది. సమస్యలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని స్వామిని ఆరాధిస్తూ ఉండిపోతుంది. భగవంతుని ప్రేమను పొంది సుల్తాను కూతురు బీబీనాంచారిగా మారుతుంది. ఆ తరువాత ఆమె ఆ స్వామిలో ఐక్యమౌతుంది. భక్తికి మతం అడ్డుకాదని ఈ కథ మనకు తెలియజేస్తుంది.