కార్తీకమాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో భక్తి కిరణాలు ప్రసరిస్తున్నాయి. దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారు జామున సముద్ర లేదా నదుల్లో స్నానం చేసి భక్తితో మహాశివుడిని దర్శించుకొని తరిస్తున్నారు. ఇక కొంతమంది భక్తులు ఇంట్లోనే స్నానాలు పూర్తిచేసుకొని తెల్లవారు జామునే ఇంటిముందు దీపం వెలిగించి తమ భక్తిని చాటుకుంటున్నారు.
అత్యంత పవిత్రమైన ఈ కార్తీకమాసంలో తెల్లవారుజామున చన్నీటి స్నానం, ఇంటిముందు దీపం వెలిగించడం అత్యంత ప్రధానం. తెల్లవారుజామునే స్నానం చేయడం అదీ చన్నీళ్లతో స్నానం చేయడం వలన శరీరం పలురకాలైన రుగ్మతల నుంచి విముక్తి కలుగుతుంది. చలిప్రారంభమయ్యే సమయం కావడంతో చన్నీళ్లతో స్నానం చేయడం వలన శరీరాన్ని చలికి అనుకూలంగా మలుచుకోవచ్చు. ఇక ఈ మాసంలో ఏకభుక్త భోజనం చేయడం ముఖ్యం. ఎందుకంటే, చలికాలంలో జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. చురుగ్గా పనిచేయదు. ఈ కారణంగా ఏకభుక్త భోజనం చేయాలి.
అదేవిధంగా ఘాటైన ఉల్లి, వెల్లుల్లిని దూరంగా ఉంచాలి. దీంతోపాటు మంసాహారానికి దూరంగా ఉండటం మంచిది. జీర్ణవ్యవస్థ మందగిస్తుంది కాబట్టి ఇలాంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. తల్ఫలితంగా జీర్ణవ్యవస్థ పునరుజ్జీవనం అవుతుంది. కొంతకాలం రెస్ట్ ఇవ్వడం కారణంగా మరలా చురుగ్గా పనిచేసేందుకు అనువుగా మారుతుంది. దీనికి భక్తిని యాడ్ చేయడంతో ఉపవాసం శ్రేష్ఠమని చెబతారు. అంతేకాదు, శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం కావడంతో ఈ మాసంలో దీపోత్సవాలను కూడా నిర్వహిస్తారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి రోజున ఆలయాల్లో పెద్ద ఎత్తున పూజలు, దీపాలు వెలిగిస్తారు. ఈ మాసంలో తెల్లవారుజామున, ప్రదోష సమయంలో దీపం వెలిగించడం అత్యుత్తమం.