సంక్రాంతి పండుగ అనగానే మన మనస్సులోకి ముందుగా మెదిలేది రంగవల్లుల అందాలు, గొబ్బెమ్మల సందడి, హరిదాసుల కీర్తనలు, బసవన్నల ఆటలు, నువ్వుల మిఠాయిల రుచులు, ఆకాశంలో ఎగురుతున్న రంగురంగుల గాలిపటాలే. ఈ పర్వదినం కేవలం ఆనందోత్సవమే కాదు… పంటల పండుగగా, జీవనంలో మార్పుకు సంకేతంగా కూడా భావిస్తారు. గతాన్ని గుర్తుచేస్తూ, వర్తమానాన్ని శుద్ధి చేసుకుని, భవిష్యత్తును సత్కార్యాల వైపు మలచుకోవాలని ఈ పండుగ మనకు ఉపదేశిస్తుంది.
మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి ఉత్తరాయణ పుణ్యకాలానికి శ్రీకారం చుడతాడు. అందుకే ఈ రోజున సూర్యభగవానుడిని నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజించడం అత్యంత శుభప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. సూర్యుడు ప్రత్యక్ష దైవం కావడంతో ఆయన కృప పొందితే ఆరోగ్యం, ఐశ్వర్యం, దీర్ఘాయుష్షు లభిస్తాయని పండితుల విశ్వాసం.
అయితే ఈ పవిత్ర సంక్రాంతి పండుగ వేళ కొన్ని పనులు ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడదని శాస్త్రోక్తంగా పేర్కొనబడింది. అందులో ముఖ్యమైనది – భోగి, మకర సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజులు స్నానం చేయకుండా ఉండకూడదు. “రవి సంక్రమణే ప్రాప్తే న స్నాయాద్యస్తు మానవాః” అని శాస్త్రవాక్యం స్పష్టంగా చెబుతోంది. ఈ రోజుల్లో స్నానం చేయని వారు ఏడు జన్మల వరకు రోగాలు, దారిద్ర్యంతో బాధపడతారని విశ్వాసం. అందుకే తెల్లవారుజామున లేచి, సూర్యోదయం వేళ పవిత్ర స్నానం చేసి సూర్యనమస్కారం చేయడం అపార పుణ్యఫలాన్ని ఇస్తుంది.
ఇక రెండవది… మకర సంక్రాంతి వంటి పుణ్యదినంలో కోడి పందేలు ఆడటం గానీ, చూడటం గానీ మహాపాపంగా శాస్త్రాలు చెబుతున్నాయి. నిరపరాధ జంతువులను హింసించడం దేవతలకు అసహ్యకరం. గరుడ పురాణం ప్రకారం ఇలా ప్రాణులకు బాధ కలిగించే వారు శూలప్రోత నరకాన్ని అనుభవించాల్సి వస్తుందని, తదుపరి జన్మలో కూడా శారీరక బాధలు తప్పవని పేర్కొంది.
కాబట్టి మకర సంక్రాంతి రోజున భక్తి, శుద్ధి, దానం, ఆరాధనలతో జీవితం పవిత్రంగా మలుచుకోవడం ప్రతి ఒక్కరి ధర్మం. ఇదే నిజమైన సంక్రాంతి సందేశం.