మకర సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు… భారతదేశమంతటా ఉత్సవ వాతావరణం కనిపిస్తుంది. ఈ పండుగతో ప్రకృతి కూడా కొత్త ఊపిరి పీల్చుకుంటుంది. చలి తగ్గి, సూర్యుడు ఉత్తరాయణం వైపు ప్రయాణం ప్రారంభించే ఈ శుభ సమయంలో గాలిపటాలు ఎగురవేయడం ఒక ఆనవాయితీగా మారింది. పిల్లల చేతుల్లో చిన్న పటాల నుంచి పెద్దల ఆకాశాన్ని తాకే పటాల వరకూ ప్రతి ఒక్కరి మనసు ఆనందంతో నిండిపోతుంది.
గాలిపటాల సంప్రదాయానికి ఆధ్యాత్మిక నేపథ్యమూ ఉంది. పురాణ కథనాల ప్రకారం, మకర సంక్రాంతి రోజున శ్రీరాముడు తన సోదరులతో కలిసి గాలిపటం ఎగురవేశాడని చెబుతారు. ఆ పటం ఆకాశాన్ని దాటి ఇంద్రలోకానికి చేరిందన్న కథ భక్తులలో ప్రసిద్ధి. తులసీదాస్ రచించిన రామచరితమానస్‌లో కూడా బాలకాండలో ఈ సంఘటన ప్రస్తావనకు వస్తుంది. అప్పటి నుంచే సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగురవేయడం శుభ సూచకంగా భావిస్తున్నారు.
ఇది కేవలం వినోదమే కాక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఉదయపు సూర్యకిరణాలు శరీరానికి తగలడంతో విటమిన్ డి లభించి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి చురుకుదనం వస్తుంది.
గాలిపటాల చరిత్రను పరిశీలిస్తే, అవి రెండువేల ఏళ్ల క్రితమే చైనాలో ఆవిర్భవించాయి. మొదట సందేశాల పంపకానికి ఉపయోగించిన ఈ పటాలు, కాలక్రమంలో భారత్‌కు చేరి పండుగల ఆనందానికి ప్రతీకగా మారాయి. నేడు సంక్రాంతి గాలిపటాలు భక్తి, సంప్రదాయం, ఆనందం మేళవించిన భారతీయ సంస్కృతికి అద్దం పడుతున్నాయి.