శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు వైభోగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నాలుగోరోజైన శనివారం రోజు తిరుమల క్షేత్రం భక్తులతో కళకళలాడింది. ఉభయ దేవేరులతో కలిసి రాజమన్నార్ ఆలంకారంలో, కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చారు. స్వామివారి వాహనానికి ముందు గజరాజులు నడుస్తుండగా, భక్త జన, భజన బృందాలు, కోలాట నృత్యాలు, మంగళవాయిద్యాల నడుమ వాహనసేన వైభవోపేతంగా సాగింది. భక్తులు స్వామివారికి హారతి నీరాజనాలు ఆర్పిస్తూ, జయజయధ్వానాలు చేశారు. పురాణాల ప్రకారం క్షీరసాగరమథనంలో ఉద్భవించిన దివ్యమైన వృక్షం కల్పవృక్షం.
ఈ వృక్షం నీడన చేరినవారికి ఐహిక భోగాలు లభించడమే కాకుండా పూర్వజన్మ స్మరణ కూడా కలుగుతుందని అంటారు. సాధారణ వృక్షాలు వాటి శక్తిమేరకు మాత్రమే ఫలితాలను ఇస్తే, కల్పవృక్షం అలా కాకుండా కోరిన ఏ ఫలాన్నైనా ఇస్తుంది. అటువంటి కల్పవృక్షంపై స్వామివారు ఊరేగుతుండగా దర్శించుకోవడం అంటే సాధారణమైన విషయం కాదు. ఆ దర్శనభాగ్యం కొంతమందికే వస్తుంది.
ఇక ఇదిలా ఉంటే ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సకల లోకాలను పరిపాలించే స్వామి కావడంతో ఆయన్ను సర్వభూపాలుడు అని చెబుతారు. భూమండలంలో ఎక్కడ ఏం జరిగినా అది ఆ స్వామికి తెలుస్తుంది. ఆయనకు తెలియకుండా సామాన్యులమైన మనం ఏమీ చేయలేం. అందుకే ఎరుకతో పనులు చేయాలని అంటారు.