సంక్రాంతి పండుగ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది కొత్త బట్టలు, గాలిపటాలు, పిండి వంటలు, పల్లెటూరి ఆటలు, హరిదాసుల పాటలు. కానీ ఈ ఉత్సవాల వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మికతను మనం చాలాసార్లు గమనించం. నిజానికి సంక్రాంతి అనేది కేవలం ఆనందోత్సవం మాత్రమే కాదు… ఇది మన జీవితాన్ని శుభపథంలో నడిపించే ఒక మహాపర్వం.
భోగి నుంచి కనుమ వరకూ వచ్చే ఈ మూడు రోజులు ఆధ్యాత్మికంగా అత్యంత శక్తివంతమైన రోజులు అని పండితులు చెబుతారు. ఈ రోజుల్లో మనం కొన్ని విధులను భక్తిశ్రద్ధలతో చేస్తే, జీవితంలో ఎన్నో అవరోధాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
భోగి రోజు మొదటిగా మనం చేయాల్సింది పీడ వదిలించుకోవడం. ఉదయం తలస్నానం చేసి, భోగి నీళ్లతో శరీరాన్ని శుద్ధి చేసుకోవడం, చిన్నపిల్లలకు భోగి పళ్లు పోయడం, ఇంటి ముందు భోగి మంట వేయడం ఇవన్నీ కేవలం సంప్రదాయాలు కాదు… ఇవి మన ఇంట్లోని ప్రతికూలతలను అగ్నికి ఆహుతి చేసే ఆధ్యాత్మిక ప్రక్రియలు. భోగి మంట ఒక చిన్న అగ్నిహోత్రంలాంటిది. దేవతలను మన ముంగిటకు ఆహ్వానించే పవిత్ర సంకేతం.
అదే రోజు ధనుర్మాసానికి చివరి రోజు కావడంతో, దగ్గర్లోని దేవాలయానికి వెళ్లి గోదాదేవి కళ్యాణంలో పాల్గొనడం మహా శుభప్రదం. నువ్వులతో చేసిన పదార్థాలను తినడం, పక్కవారికి పంచడం ద్వారా ఆరోగ్యం, సంపద పెరుగుతాయి. అలాగే ఇంటి ముంగిట ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టడం భూమాతకు చేసే నమస్కారంగా భావిస్తారు.
మూడు రోజుల పండుగలో అత్యంత పవిత్రమైన రోజు మకర సంక్రాంతి. ఈ రోజు సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించి ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ప్రారంభిస్తాడు. నువ్వుల పిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయడం శనిదోషాలను తగ్గిస్తుందని నమ్మకం. ఇంట్లో శివలింగానికి నెయ్యితో రుద్రాభిషేకం చేయడం ద్వారా దారిద్ర్యబాధ తొలగిపోతుందని శాస్త్రోక్తి. పితృదేవతలకు తర్పణం, శ్రాద్ధం వంటి విధులు చేయడం కుటుంబానికి శాంతిని అందిస్తుంది. పెరుగు దానం చేస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుందని విశ్వాసం.
కనుమ రోజు పశుసంపదకు అంకితం. గోవులకు ఆహారం పెట్టడం, గోపూజ చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజు మినుములతో చేసిన వంటకాలు తినడం ఆరోగ్యానికి, ఆయుష్షుకు శుభకరం.
ఇలా భోగి, సంక్రాంతి, కనుమ – ఈ మూడు రోజులు కేవలం పండుగలే కాదు… మన జీవనయాత్రను సరిదిద్దే ఆధ్యాత్మిక మార్గదర్శకాలు. భక్తితో పాటిస్తే, ఈ సంక్రాంతి నిజంగానే జీవితంలో కొత్త వెలుగులు నింపుతుంది.