శ్రీకృష్ణుడు ఎక్కడ ఉన్నాడు అంటే…ఆయన సర్వాంతర్యామి. అందుగలడు ఇందులేడన్న సందేహం వలదు అంటాం. కానీ, శ్రీకృష్ణుడి గురించి ప్రత్యేకించి చెప్పాల్సి వచ్చినపుడు ఏడు ప్రదేశాల గురించి చెప్పుకుంటాం. మరి ఆ ఏడు ప్రదేశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
ఏడు ప్రదేశాల్లో మొదటిది ఉత్తరప్రదేశ్‌లోని వృందావన్ గురించి చెప్పుకుంటాం. ఇక్కడ శ్రీకృష్ణుడు ఎక్కువకాలం గడిపాడు. ఆయన రాసలీలలకు సంబంధించిన ప్రాంతం వృందావన్. గోపికలతో కలిసి తన లీలలను చూపిన ప్రాంతం కూడా ఇదే. పురాణాల ప్రకారం, పూర్వం రోజుల్లో వృందావన్‌లో సుమారు 500 దేవాలయాలు ఉన్నట్టుగా చెబుతారు. ఆ తరువాత కాలంలో అవి క్రమంగా అంతరించిపోయాయి. ఇప్పుడు శ్రీకృష్ణుడి ప్రధాన ఆలయంతో పాటు మరికొన్ని ఆలయాలు మాత్రమే మనకు దర్శనం ఇస్తున్నాయి.
శ్రీకృష్ణుడు, రాధాదేవి పుట్టిన ప్రాంతమైన బర్సానా కూడా కన్నయ్యకు సంబంధించినంత వరకు ప్రాధాన్యత కలిగిన ప్రదేశమే. రాధాకృష్ణల ప్రేమకు చిహ్నంగా ఉన్న ప్రాంతం బర్సానా. మధ్యయుగంనాటి ఆర్కిటెక్చర్‌తో ఇక్కడి ప్రదేశాలు మనకు కనువిందు చేస్తాయి. ఇక్కడ రాధాకృష్ణల ఉత్సవం ఘనంగా నిర్వహిస్తారు.
శ్రీకృష్ణుడు పరిపాలన సాగించిన ప్రదేశం ద్వారకా. కంసుడిని వధించి ద్వారకను స్వాధీనం చేసుకున్నాడు. ఇక్కడి నుంచే ఆయన తన ప్రజలను పరిపాలించాడు. నేటికీ అరేబియా సముద్రంలో ద్వారకానగరాకిని సంబంధించిన ఆనవాళ్లను మనం చూడవచ్చు.
పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు జన్మించిన ప్రదేశం మధుర. ఒక్కసారి మధురలో అడుగుపెడితే తెలియని ధైర్యం శరీరంలో కలుగుతుంది. పాజిటీవ్ ఎనర్జీ మనల్ని అంటిపెట్టుకుంటుంది. మధురలో శ్రీకృష్ణుడు పుట్టిన ప్రదేశంపై వివాదం చెలరేగుతూనే ఉండటం విశేషం.
మహాభారతం గురించి చెప్పుకుంటే తప్పకుండా కురుక్షేత్ర ప్రస్తావన వచ్చి తీరుతుంది. ఈ కురుక్షేత్రలోనే యుద్ధం జరిగింది. శ్రీకృష్ణుడు ఇక్కడే అర్జునుడికి భగవద్గీతను బోధించాడు. హిందూవులకు ఈ ప్రాంతం అత్యంత పవిత్రమేనది. వీటితో పాటు గోవర్థన గిరి, ఉడిపి కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంది.