ఎలా పూజించాలి?
భగవంతుడిని ఎలా పూజించాలి. దీనికి ఎవరికి నచ్చినట్టుగా వారు ఉపాఖ్యానాలు ఇస్తుంటారు. సాధారణంగా ఇంట్లోని దేవుని గదిలో ఒకవిధంగా పూజ చేస్తే, ఆలయంలో గర్భగుడిలో స్వామివారికి జరిగే పూజలు మరోలా ఉంటాయి. పెద్ద పెద్ద వేదికలపై స్వామివారి ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి జరిపించే పూజలు మరో విధంగా ఉంటాయి. వేద మంత్రాలతో స్వామిని ఆవాహనం చేసి, ఆసనం సమర్పించి పరిమళభరితమైన పువ్వులతో స్వామిని అర్చిస్తారు. మనమే చెబుతున్నాం భగవంతుడు విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడు అని, భగవంతుడికి రూపలావణ్యాలతో సంబంధంలేదు. అందుగలడు ఇందులేడన్న సందేహం వలదు… శ్రీహరి అన్నింటా ఉన్నాడని ప్రహ్లాదుడు నిరూపించాడు. ప్రళయం లాంటి మరణం తరుముకొస్తే శివా అంటూ శివలింగాన్ని ఆలింగనం చేసుకున్న మార్కండేయుడిని రక్షించేందుకు శివలింగాన్ని చీల్చుకు వచ్చినట్టుగా మార్కండేయ పురాణం చెబుతున్నది. బలిని పాతాళానికి తొక్కుతూ విశ్వమంతా వ్యాపించిన వటుడి రూపంలోనూ కొలువై ఉన్నాడు. ఇలాంటి స్వామిని ఎలా మనం పూజించగలం. నిజమే కదా.
సంపూర్ణ శరణాగతి
నిష్టగా భగవంతుడిని ఆరాధించేవారు షోడశోపచార పూజలు చేస్తుంటారు. షోడశోపచార పూజ అంటే 16 రకాలైన వాటితో స్వామిని అర్చించడం. ముందుగా స్వామిని ఆహ్వానించాలి. దైవభాషలో ఆహ్వానం అంటే ఆవాహం చేయాలి. పరివ్యాప్తమైన స్వామిని ఎలా ఆవాసం చేస్తాం. అది సాధ్యమయ్యే పనికాదు. ఆవాహనం చేసిన స్వామికి ఆసనం వేయాలి. విశ్వమంతా వ్యాపించిన స్వామికి మన ఇంట్లో పూజగదిలో ఆసనం వేసి కూర్చోబెట్టగలమా. ఇక శుద్దోదక స్నానం చేయించాలి. గంగనే తన తలపై నిలుపుకున్న స్వామిని అభిషేకించడం సాధ్యం కాదు. వస్త్రాన్ని సమర్పించలేం. సుంగంధ పరిమళాల పువ్వులను ఇవ్వలేం. గంధాన్ని లేపనంగా పూయలేం. ఇవన్నీ మనం మన పూజగదిలో చేస్తున్నామని భావిస్తూ చేస్తాం అంతే. మరి స్వామిని ఎలా పూజించాలి. అంటే రెండు చేతులు జోడించి స్వామి నేను మీకు ఏమీ ఇవ్వలేను. నేను మీకు ఇవ్వదగిందల్లా నా మనసు మాత్రమే. ఈ మనసును సంపూర్ణంగా నీకు సమర్పిస్తున్నాను. దీన్ని పుచ్చుకొని నన్ను అనుగ్రహించవయ్యా అని పిలిస్తే చాలు. ఆ స్వామి ఎంతగానో పొంగిపోతాడట. దీనినే మనం సంపూర్ణ శరణాగతి అని చెబుతాం. స్వామికి సంపూర్ణ శరణాగతులైన వారికి తప్పకుండా తన వాడిగా చేసుకుంటారని సాక్షాత్తు ఆదిశంకరాచార్యులవారే పేర్కొన్నారు. అన్నీ ఉన్న ఆయనకు మనం ఏమి ఇవ్వగలం చెప్పండి. మన మనసును తప్ప. కానీ మనం మన మనసును తప్పా అన్నింటినీ భౌతికమైనవి ఆయనకు ఇవ్వాలని చూస్తున్నాం. భౌతిక శరీరంతో చేసే పూజ ఎప్పుడూ సంపూర్ణం కాదు. మనసుతో చేసిన పూజ మాత్రమే ఫలిస్తుంది. ఇది అంత తేలికైన అంశం కాదు. మనసును స్వామిపై లగ్నం చేయాలంటే…ఎంతో సాధన కావాలి.
కోతిలాంటి మనసును అదుపు చేయాలి
మనసు కోతిలాంటిది అని ఆదిశంకరాచార్యులు పేర్కొన్నారు. ఈ కోతి జీవనమనే అడవిలో సంసారమనే చెట్టు కొమ్మపై కూర్చొని అటు ఇటూ దూకుతూ ఉంటుంది. ఒకచోట స్థిరంగా ఉండదు. బంధాలు, బంధుత్వాలు, ఆశలు, అత్యాసలు, కోరికలతో ఊగిపోతూ ఉంటుంది. నాకు నీకు మధ్య దూరం తగ్గాలి అంటే ఎగిరే ఈ కోతి మెడకు గట్టిగా తాడును కట్టి ఒకచోట కూర్చోబెట్టమే చేయాలి. అది మానవమాత్రుల వలన సాద్యం కాదు. ఆ పరమేశ్వరుని అనుగ్రహం చేతనే ఇది సాద్యమౌతుంది. అందుకే గుడికి వెళ్లినా, లేదా ఇంట్లో పూజ చేస్తున్నా భౌతికమైన కోరికలు కాకుండా నీయందు మనసు నిలిపే భాగ్యం ఒక్కటి చాలు స్వామి అని మొక్కుకోవాలి. నిత్యం ఇలా కోరుకోవడం వలన ఆ కోరిక సంకల్పంగా మారుతుంది. కొద్దికొద్దిగా మనసులోని మాలిన్యాలు తొలగిపోయి స్వచ్చమై భగవంతుడిని నిలిపుకుంటుంది. మనసులో భగవంతుడి రూపాన్ని నిలుపుకున్న వ్యక్తి ఈ భౌతిక ప్రపంచంలో దేనినైనా సాధించగలడు. ప్రతి ఒక్కరిని తన కాళ్లపై పడేలా చేయగలడు.