నిత్యకళ్యాణం పచ్చతోరణం
తిరుమల అంటే మనకు గుర్తుకు వచ్చేది నిత్య కళ్యాణం పచ్చతోరణం. బ్రహ్మాండనాయకుని వైభవాన్ని, ఆయనకు నిర్వహించే వైభవోపేతమైన ఉత్సవాలను ఎంత చెప్పినా తక్కువే. ఎన్నిసార్లు చూసినా అబ్బా ఇంకొసారి చూస్తే బాగుండు అనుకుంటాం కదా. అందులోనూ ఆశ్వీయుజ మాసంలో నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవాలను గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నిసార్లు చూసినా తనివితీరదు. ముక్కోటి దేవతలే దిగొచ్చి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారని అంటారు. ఒక్కోరోజు ఒక్కొక్క వాహనంపై ఒక్కో అలంకరణలో శ్రీవారు మాడవీధుల్లో ఊరెరుగుతూ అందర్నీ పలకరిస్తుంటారు. ఆ కోనేటి రాయుడి ఉత్సవాల గురించి ఈ రోజు కొన్ని విషయాలను తెలుసుకుందాం.
కోయిల్ ఆళ్వారు తిరుమంజనం
బ్రహ్మోత్సవాలు నిర్వహించే ముందు శ్రీవారి ఆలయాన్ని శుద్ధిచేసే పవిత్ర కార్యక్రమం ఉంటుంది. దీనినే కోయిల్ అళ్వారు తిరుమంజనం అంటారు. కోయిల్ అంటే దేవాలయం అని, ఆళ్వారు అంటే భక్తుడు అని అర్ధం. భక్తుని హృదయంలో భగవంతుడు ఉన్నట్టుగానే, దేవాలయంలో గర్భగుడిలో కూడా భగవంతుడు నివశిస్తాడు అనే భావనతో ఈ శుద్ధిని నిర్వహిస్తారు. ఆలయాన్ని ఒక జీవవంతమైన భక్తునిలా గౌరవించబడుతుంది.
ఎప్పుడు ఎలా
అయితే ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఎప్పుడు నిర్వహిస్తారు అంటే వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించే ముందు వచ్చే మంగళవారం రోజున జరుపుతారు. అదేవిధంగా ఏడాదిలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంను నిర్వహిస్తారు. ఒకటి బ్రహ్మోత్సవాలకు ముందు, రెండోది ఉగాది పండుగకు ముందు, మూడోది అణివారి ఆస్థానం ముందు, నాలుగోది వైకుంఠ ఏకాదశి పండుగ ముందు ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంను నిర్వహిస్తారు.
అసలు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారు అన్నది కూడా అత్యంత ప్రాముఖ్యమైనదే. గర్భగుడిలోని గోడలు, పైకప్పులు, దీపాలకు అంటుకున్న మసిని, ధూళి, బూజు ఇలా అన్నింటినీ శుభ్రం చేస్తారు. ఆ తరువాత సుగంధ ద్రవ్యాలతో తయారైన లేహ్యం దీనినే మన భాషలో పరిమళం అని కూడా అంటాం. దీనిని గోడలకు, పై కప్పులకు పూస్తారు. ఆ తరువాత పంచపాత్రలు, తీర్థప్రసాద పాత్రలు, దీపాలు మొదలైని వాటిని బంగారుబావి వద్దకు తీసుకొని వెళ్లి శుభ్రం చేస్తారు. బంగారు బావి అంటే ఏమిటి? దానికి ఆ పేరు ఎలా వచ్చింది అన్నది మరో సందర్భంలో చెప్పుకుందాం. ఆ తరువాత వాకిళ్లను, స్వామివారిని ఊరెరిగించే వాహనాలను, పరివార దేవతల ఆలయాలను శుద్ధిచేస్తారు.
మలై గుడారం
శుద్ధి సమయంలోనే మలై గుడారం అనే తంతును నిర్వహిస్తారు. మలైగుడారం అంటే స్వామివారి మూల విరాట్‌పై దుమ్ము పడకుండా ఓ వస్త్రాన్ని తొడుగుతారు. ఇదే మలై గుడారం. ఆ తరువాత అక్కడ ఉన్న ఉత్సవ విగ్రహాలు, సాలగ్రామాలను ఘంటామండపానికి తరలించి ప్రత్యేకంగా తిరుమంజనం నిర్వహిస్తారు.
తిరుమంజనం కార్యక్రమం పూర్తి అయిన తరువాత ఆలయానికి నూతన తెరలు కడతారు. మలైగుడారంను తొలగించి శ్రీవారికి కర్పూర హారతిని ఇస్తారు. ఈ కార్యక్రమాలు పూర్తయ్యాకనే స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఈ కార్యక్రమాలు పూర్తైన వెంటనే ఆలయాన్ని రంగురంగు విద్యుత్ దీపాలతో, అరటి స్థంభాలతోనూ, మామిడి ఆకులతోనూ అలంకరిస్తారు. స్వామివారితో పాటు ఆలయంలో పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మోత్సవాలకు సిద్దమౌతారు.