ఉత్తరాయణం అంటే సూర్యుడు ఉత్తర దిశగా తన పయనాన్ని ప్రారంభించే శుభకాలం. మన పూర్వీకులు సూర్య సంచారాన్ని ఎంతో లోతుగా పరిశీలించి, ఉత్తరాయణం–దక్షిణాయణం అనే రెండు పవిత్ర ఆయనాలుగా విభజించారు. మకర సంక్రమణతో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించగానే ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఈ కాలాన్ని దేవతలకు పగలు అని, దక్షిణాయణాన్ని దేవతలకు రాత్రిగా పురాణాలు వర్ణిస్తాయి. అంటే ఉత్తరాయణంలో దేవతలు యోగనిద్ర నుంచి మేల్కొని భూలోకాన్ని కరుణతో దర్శించే సమయమని భక్తుల విశ్వాసం. అందుకే ఈ సమయంలో చేసే జపతపాలు, దానధర్మాలు, పుణ్యకార్యాలు అనంత ఫలితాలు ఇస్తాయని శాస్త్రాలు చెబుతాయి.
దేవతలు జాగృతులుగా ఉండే ఈ పుణ్యకాలంలో మరణించినవారికి మోక్షప్రాప్తి కలుగుతుందనే నమ్మకం కూడా ఉంది. అందుకే భీష్మ పితామహుడు ఉత్తరాయణం వచ్చే వరకూ అంపశయ్యపై ఎదురు చూసి ప్రాణత్యాగం చేసినట్టు మహాభారతం చెబుతుంది. చలి తగ్గి వాతావరణం అనుకూలంగా మారే ఈ సమయంలో తీర్థయాత్రలు, వ్రతాలు చేయడం శ్రేయస్కరం. మకర సంక్రాంతి నుంచి స్వర్గద్వారాలు తెరుచుకుంటాయని, ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు, దానధర్మాలు చేయడం వల్ల వారికి సద్గతి లభిస్తుందని పురాణ విశ్వాసం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మనమూ భక్తితో పుణ్యకార్యాలు చేసి, మన జీవితాలను, మన పితృదేవతల గమ్యాన్ని కూడా పవిత్రం చేసుకుందాం.