ఈరోజు వైకుంఠ చతుర్దశి. శివుణ్ణి, విష్ణుమూర్తిని పూజించడానికి అనుకూలమైన రోజు. శివ పురాణం ప్రకారం ఈ చతుర్దశి రోజున విష్ణుమూర్తి, కాశీలోని విశ్వనాథున్ని 1000 కలువ పూవులతో పూజించడానికి వెళ్ళాడు అని, కానీ పూజా సమయం లో 999 పూవులు ఉన్నట్లుగా గుర్తించి, కలువ పువ్వుల్లాంటి తన కన్నులలో ఒక కన్ను పెకిలించి, శివపూజ చేశాడనీ, భక్తికి మెచ్చిన శివుడు పెకిలించబడిన కన్నుతో పాటుగా సుదర్శన చక్రాన్ని విష్ణుమూర్తికి బహుమానం గా ఇచ్చాడు అని పురాణ కథనం.
ఈరోజు విష్ణు భక్తులు విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేస్తూ 1000 కలువలతో విష్ణుమూర్తి పూజ చేస్తారు. ఈ చతుర్దశి రోజు విష్ణుమూర్తిని, శివుణ్ణి ఆరాధించడానికి అనువైన రోజు. విష్ణుమూర్తి భక్తులు అర్ధరాత్రి సమయంలో విష్ణుపూజ చేస్తారు (రాత్రి 11.35 నుండి రాత్రి 12.25 మధ్య కాలంలో). శివ భక్తులు అరుణోదయ సమయంలో కాశీలోని మణికర్ణికా ఘట్టము లో స్నానం ఆచరించి విశ్వనాథున్ని పూజిస్తారు.
సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే కాశీలోని విశ్వనాథుని గర్భగుడిలో విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ చతుర్దశి రోజున విష్ణుమూర్తి కాశీలోని విశ్వనాథున్ని దర్శించుకున్నట్లుగా, ఒకరికొకరు పూజలు చేసుకున్నట్లుగా భక్తుల నమ్మకం. అందుచేత విష్ణుమూర్తి శివునికి బిల్వ పత్రాలు సమర్పించినట్లు గా,తిరిగి విశ్వనాథుడు తులసీ దళాలు విష్ణుమూర్తికి అర్పించినట్లుగా ప్రత్యేక శాస్త్రోక్త పూజలు విశ్వనాథుని ఆలయంలో జరుగుతాయి.