మొదట చెడు ఎంత ఇబ్బందులకు గురిచేసినా చివరకు చెడుపై మంచి విజయం సాధిస్తుంది అని చెప్పడానినే మనం విజయదశమిని జరుపుకుంటాం. చెడుపై మంచి విజయం సాధించిన రోజే విజయదశమి. ఈ రోజున మహిషాసురుడిని సంహరించిన దుర్గామాతను, అదేవిధంగా లంకరాజైన రావణుడిని సంహరించిన శ్రీరాముడిని కూడా స్మరించుకుంటారు. విజయదశమి రోజున ఏ పని మొదలుపెట్టినా అది శుభంగా జరుగుతుందని, విజయవంతంగా పూర్తవుతుందని నమ్ముతారు. అందుకే విద్యాభ్యాసం, ఆయుధపూజ, వాహనపూజ వంటి వాటిని చేస్తారు.
ఇంట్లో అమ్మవారిని పసుపు, కుంకుమ, పూలతో ఆరాధించి నవరాత్రుల్లో చేసిన పూజలను ముగిస్తారు. ఈ రోజున దేవికి చామంతి పూలు, వేపాకు నైవేద్యం సమర్పించడం విశేషం. భక్తులు “అపరాజిత పూజ” చేసి విజయశ్రీ కలగాలని కోరుతారు. విజయదశమి రోజున పుస్తకాలు, పనిముట్లు, ఆయుధాలు, వాహనాలకు పూజ చేస్తే విద్యా జ్ఞానం, వృత్తిలో విజయాలు లభిస్తాయి. ధర్మానికి కట్టుబడి ఏ పని ప్రారంభించినా విజయదశమి శుభఫలితాలు అనుభవిస్తారు. ఈ రోజు ఆరాధన చేయడం వలన శక్తి, ధైర్యం, విజయం, ఆర్థికాభివృద్ధి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. విజయదశమి భక్తి, ధర్మం, విజయానికి సంకేతం.