హైందవ సంప్రదాయంలో వరలక్ష్మీ వ్రతం అత్యంత ముఖ్యమైనది. ఈ వ్రతం రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. శ్రావణమాసంలో పౌర్ణమిరోజు ముందు ఈ వ్రతాన్ని నిర్వహిస్తారు. ఈ వ్రత సమయంలో అమ్మవారి ప్రతిమకు చీరను కట్టి, రంగు రంగు పువ్వులతో అలంకరించి పూజిస్తారు. అయితే, చాలా మంది ఈ పూజలో అమ్మవారి ప్రతిమను తప్పనిసరిగా ఉంచాలని చెబుతుంటారు. వ్రతంలో ప్రతిమను తప్పనిసరిగా ఉంచాలా లేదా అనే విషయాలను ఈ ఆర్టికల్‌లో సవివరంగా చర్చిద్దాం. ఒకవేళ ప్రతిమను పెట్టుకుంటే ఆ ప్రతిమన విశిష్టత ఏమిటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
వరలక్ష్మీ వ్రత కథ
అమ్మవారి ప్రతిమ గురించి తెలుసుకునే ముందు వ్రత కథను గురించి తెలుసుకుందాం. అమ్మవారి వ్రతకథ మగథ రాజ్యంలో కుండిన నగరంలో జరిగిన ఓ ఆసక్తికరమైన సంఘటనతో మొదలౌతుంది. ఈ కథలో చారుమతి అనే మహిళ చుట్టూ తిరుగుతుంది. ఈ చారుమతి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన స్త్రీ. భర్త, తన కుటుంబంతో ఆనందంగా, సంతోషంగా జీవిస్తుంది. భక్తి ప్రవర్తలతో, ధర్మంతో జీవనం సాగిస్తూ దైవం పట్ల అత్యంత భక్తితో ఉంటుంది. ఇలా దైవం పట్ల నిరంతరం భక్తిని కలిగి ఉంటే ఈ చారుమతి కలలో ఓ రోజు శ్రీమహాలక్ష్మీదేవి ప్రత్యక్షమై, శ్రావణమాసంలో శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించమని సూచిస్తుంది.
ఈ వ్రతం ఆచరించడం వలన సంపదతో పాటు ఆరోగ్యం, సౌభాగ్యం, కుటుంబం క్షేమంగా కూడా ఉంటుందని చెబుతుంది. అమ్మవారి సూచనల మేరకు చారుమతి శుద్ధిగా స్నానం చేసి, ఇంటిని అలంకరించి అమ్మవారి ప్రతిమను ప్రతిష్టించి శాస్త్రోక్తంగా పూజలు చేస్తుంది. చారుమతి పూజకు సంతుష్టురాలైన లక్ష్మీదేవి ఆమెకు సిరిసంపదలు, ఆయురారోగ్యాలు ప్రసాదిస్తుంది. ఈ కథ ఆధారంగా వరలక్ష్మీ వ్రతం ఆనాటి నుంచి నేటి వరకు కొనసాగుతూ వస్తోంది. ఈ వ్రతం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చని భక్తులు విశ్వసిస్తున్నారు.
అమ్మవారి ప్రతిమ ప్రాముఖ్యత
వరలక్ష్మీ వ్రతంలో అమ్మవారి ప్రతిమను మందిరంలో ఉంచి పూజించడం సంప్రదాయంలో భాగంగా చూస్తాం. లక్ష్మీదేవి రూపంలో ఉండే ప్రతిమను తీసుకొచ్చి పూజగదిలో ఉంచుతాం. ఈ విగ్రహం మట్టితో చేసిందిగాని, రాగితో చేసిందిగాని, వెండితో చేసిందిగాని, లేదా బంగారంతో చేసిందిగాని అయి ఉండవచ్చు. ఈ ప్రతిమ అందుబాటులో లేకుంటే కనీసం అమ్మవారి చిత్రపటమైనా పూజలో వినియోగిస్తాం. అమ్మవారి ప్రతిమను పూజలో ఉంచడం వలన అమ్మవారి సాన్నిధ్యంలో ఉన్నట్టుగా భావిస్తారు. పూజ చేసుకోవడానికి అనువుగా కూడా ఉంటుంది.
అయితే, వరలక్ష్మీ వ్రతంలో అమ్మవారి ప్రతిమ తప్పనిసరిగా ఉండాలా లేదా అనే ప్రశ్నకు… తప్పనిసరి కాదు అన్నదే సమాధానం. శ్రాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి సర్వాంతర్యామి. చక్రి సర్వోపగతుడు అన్నట్టుగానే ఆయన సతీ లక్ష్మీదేవి కూడా సర్వవ్యాప్తి కలిగిన దేవత. ఆమెను మనస్ఫూర్తిగా భక్తిత పూజిస్తే చాలు ఆమె అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ప్రతిమ ఉంటేనే అమ్మవారు అనుగ్రహిస్తారు అనుకుంటే పొరపాటే. ఒకవేళ అమ్మవారి విగ్రహం ఉంటేనే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అనుకుంటే… అమ్మవారి ఎటువంటి ప్రతిమను పూజించాలి అన్నది కూడా సందేహమే. అందుకే, రూపు ఉన్నా లేకున్నా, చిత్రపటం ఉన్నా సరిపోతుంది. చిత్రపటం, ప్రతిమ ఉండాలన్నది నియమం కాదు… ఈ రెండు లేకున్నా కలశం ఉన్నా సరిపోతుంది. ఈ కలశమే అమ్మవారిగా భావించి కలశంలో అమ్మవారిని స్థాపన చేసి పూజిస్తారు.
పూజా విధానం
వరలక్ష్మీ వ్రత పూజలో కొన్ని ముఖ్యమైన దశలు ఉంటాయి:
- సంకల్పం: ఉదయాన్నే స్నానం చేసి, శుద్ధమైన ఇంటిలో పూజను ప్రారంభించడం. వ్రతం ఆచరించాలని సంకల్పం చేయడం.
- కలశ స్థాపన: ఒక కలశంలో నీరు నింపి, దానిపై మామిడి ఆకులు, కొబ్బరికాయను ఉంచి, దానిని అమ్మవారి రూపంగా భావించి పూజించడం.
- అమ్మవారి అలంకరణ: బొమ్మ ఉంటే, దానిని పట్టు వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించడం. లేకపోతే, కలశాన్ని పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరించడం.
- పూజ: అష్టలక్ష్మీ స్తోత్రం, లక్ష్మీ అష్టకం, లేదా ఇతర స్తోత్రాలను పఠిస్తూ, పసుపు, కుంకుమ, పుష్పాలు, గంధం, ధూపం, దీపం, నైవేద్యం సమర్పించడం.
- తోరగ్రంథి: అమ్మవారికి దారం (తోరం) కట్టడం, ఇది వ్రతం యొక్క ప్రతీక.
- ప్రసాద వితరణ: పూజ అనంతరం ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు, ఇతర భక్తులకు పంచడం.
బొమ్మ లేకపోతే ఏమి చేయాలి?
లక్ష్మీదేవి ప్రతిమలకు ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది. దీనికి తగిన విధంగానే ధరలు మండిపోతున్నాయి. వేలకు వేలు పెడితేనే ప్రతిమలు లభిస్తున్నాయి. అంతమొత్తం పెట్టి విగ్రహాలను కొనుగోలు చేయలేనివారు ఏం చేయాలి అనే సందేహం వస్తుంది. విగ్రహం లేనివారు కలశాన్ని లేదా చిత్రపటాన్ని ఉపయోగించవచ్చు. కలశంలో నీరుపోసి కొన్ని నాణేలు వేసి, పసుపు, కుంకుమ, పుష్పాలు దానిపై కొబ్బరికాయ, జాకిట్ ముక్కను ఉంచుతారు. ఈ కలశాన్ని లక్ష్మీదేవి రూపుగా భావించి పూజిస్తారు. భక్తి, నిష్ట ఉంటే అమ్మవారు ఏ రూపంలో అయినా భక్తుల పూజను స్వీకరిస్తుందని నమ్ముతారు.
చివరిగా
వరలక్ష్మీ వ్రతం అనేది భక్తి, సంపద, సౌభాగ్యాన్ని ప్రసాదించాలని కోరుతూ నిర్వహించే పూజ. లక్ష్మీదేవి ప్రతిమను పూజలో ఉంచడం సంప్రదాయంలో బాగమైనప్పటికీ, తప్పనిసరికాదు. హృదయంలో భక్తి ఉండాలి. ఈ భక్తిభావంతో పూజ చేయడం వలన అమ్మవారు తప్పనిసరిగా కరుణిస్తారని, అనుగ్రహిస్తారని పండితులు చెబుతున్నారు. వరలక్ష్మీ వ్రతం రోజున పూజ చేయడం వలన సౌఖ్యంతో పాటు ఆరోగ్యం కూడా కలుగుతుంది.