సనాతన ధర్మం అంటే ఏమిటి? చాగంటి చెప్పిన సత్యం

What is Sanatana Dharma? The Truth Explained by Chaganti Koteswara Rao
Spread the love

మనమంతా సనాతన ధర్మం సనాతన ధర్మం అని వేదికలు ఎక్కి ప్రసంగిస్తుంటాం. మనం తెలుసుకున్నవాటిని వచనాల రూపంలో ఏకరువు పెడుతుంటాం. కానీ, అసలు సనాతన ధర్మాన్ని తూచా తప్పకుండా అనుసరించినవారు, పూనికతో ఉపాసన చేసినవారిని చూస్తే చాలు సనాతన ధర్మం ఇంతగొప్పదా అనిపిస్తుంది. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు మచ్చుకు రెండు విషయాలను మనకు తెలియజేస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

మనలో చాలామంది శృంగేరి పీఠాన్ని దర్శించుకొనే ఉన్నాం కదా. శారదాదేవి ఆలయంలోకి అడుగుపెట్టే ముందు మనకు ద్వారంపై మనకు తోరణ గణపతి కనిపిస్తాడు. పీఠం ఏర్పాటైనపుడు తోరణగణపతిని ఏర్పాటు చేశారు. అయితే, ఉగ్ర నృసింహ భారతీ పీఠాధిపతిగా ఉన్న సమయంలో ముష్కరులు దేశంపై దండెత్తారు. ఉత్తర భారతంతో పాటుగా దక్షిణ భారతదేశంలోనూ దండెత్తేందుకు ప్రయత్నిస్తున్న రోజులవి. ఆలయాల్లోని బంగారాన్ని విలువైన వస్తువులను దాడిచేసి, కూల్చివేసి దోచుకుపోతున్నారు. ఇందులో భాగంగానే శారదాపీఠంపై కూడా దాడి చేయాలని ముష్కరులు చూస్తున్నారు.

అయితే, శృంగేరీ శారదాపీఠానికి పీఠాథిపతిగా ఉన్న ఉగ్ర నృసింహస్వామికి విషయం తెలిసింది. తాను సన్యాసిని తాను ఎలా యుద్ధం చేయాలి అని ఆలోచించి తోరణగణపతిని చేత్తో ముట్టుకున్నారు. అంతే, విదేశీ ముష్కరులు ఎంత ప్రయత్నించినా శృంగేరీ పీఠంలోకి అడుగుపెట్టలేకపోయారు. తన శక్తిని గణపతిలోకి ప్రవేశపెట్టడంతో ఆ స్వామినే స్వయంగా వచ్చి ముష్కరులను అడ్డుకున్నారని చెబుతారు. ఉపాసన చేస్తే ఎలా ఉంటుంది అన్నదానికి ఇదొక ఉదాహరణ. ఇంకో ఉదాహరణ కూడా ఉంది. ఓసారి ఉగ్ర నృసింహ భారతీ స్వామివారు మధుర మీనాక్షి ఆలయానికి వెళ్లారట. అక్కడి ఆలయ నియమాల ప్రకారం ఆలయ అర్చకులు తప్ప మిగతావారెవ్వరూ గర్భగుడిలో అమ్మవారికి పూజ చేయకూడదు.

నృసింహ భారతీ స్వామివారు గర్భగుడిలో అమ్మవారిని స్వయంగా పూజిస్తామని చెప్పడంతో అర్చకులు వద్దని వారించారు. గర్భగుడిలోకి అడుగుపెట్టనివ్వలేదు. తామే పూజ చేస్తామని, మీరు బయటనుంచే నమస్కారం చేసుకోవాలని చెప్పడంతో ఉగ్ర నృసింహ స్వామివారు తన శిష్యులను పిలిచి కొబ్బరికాయను తెప్పించుకున్నారు. ఆ కొబ్బరికాయను పట్టుకొని తన మంత్ర శక్తితో అమ్మవారి కళలను కొబ్బరికాయలో నిక్షిప్తం చేశారు. అంతే అమ్మవారు ఒక్కసారిగా నల్లని బొగ్గులా మారిపోయారు. ఎక్కడా మునుపటి కళ అమ్మవారిలో కనిపించలేదు. అదే సమయంలో ఉగ్ర నృసింహ భారతీ చేతిలోని కొబ్బరికాయ దేదిప్యమానంగా వెలిగిపోయింది. కొబ్బరికాయకే పీఠాధిపతి పూజలు చేశారు.

ఆలయ అధికారులు, అర్చకులు ఉగ్ర నృసింహ భారతీ స్వామి వద్దకు వచ్చి లక్షలాది మంది భక్తులు దర్శించుకునే మీనాక్షి అమ్మవారి కళను కొబ్బరికాయలో బంధించి తీసుకెళ్లడం భావ్యం కాదని, తమ తప్పును క్షమించమని వేడుకోవడంతో శాంతించిన స్వామి కొబ్బరికాయలోని అమ్మవారిని కళల శక్తిని తిరిగి విగ్రహంలోకి ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి అమ్మవారు మరింత కళగా ఉన్నారని అంటారు. సనాతన ధర్మాన్ని శరణాగతితో నమ్మి ఆచరించినా, ఉపాసించినా ఇవన్నీ సాద్యమేనని అంటారు చాగంటి కోటేశ్వరరావు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *