ఉక్కునరాలు, ఇనుప కండరాలున్న 100 మంది యువకులను నాకివ్వండి భారతదేశానికి స్వేచ్ఛావాయువులు అందిస్తానని చెప్పని మహావ్యక్తి వివేకానందుడు. గుండెనిండా కండబలం కలిగిన యువకులు దేశతలరాతను మార్చగలరు. అందుకే యువత ఈ మధ్యకాలంలో ఇళ్లల్లో కంటే జిమ్ముల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. కండలు పెంచేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఒక్కొక్కరూ భీముడిలా బలాడ్యులు కావాలని కోరుకుంటున్నారు. ఇందులో తప్పేం లేదు. భీముడి మాట వచ్చింది కాబట్టి మనం భీముడి గురించి కొన్ని విషయాలు తప్పక చెప్పుకోవాలి. కుంతీ పుత్రుడు, పాండవ మధ్యముడు భీమసేనుడు ఎంతటి బలాడ్యుడు అంటే పెద్ద బండినిండా ఆహార పదార్ధాలు, రెండు ఎద్దులు, ఆహార పదార్ధాలు తీసుకొచ్చిన వాడిని తీనేయగల సత్తా ఉన్న బకాసుడిని ఒక్కదెబ్బకు చంపేసిన ఘనుడు. బలంలో తనకు సరిసమానమైన జరాసంధుడు, కీచకుడు, ధుర్యోధనులను అంతంచేసిన మహాబలుడు. భీముడిని చూస్తే ఎవరికైనా హడలే. కానీ, అటువంటి భీముడు కురుక్షేత్ర యుద్ధానికి ముందు ముగ్గురి చేతిలో ఓటమిపాలయ్యాడు. ఈ విషయం మీకు తెలుసా? మరి ఆ ముగ్గురు ఎవరన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
నాకంటే బలవంతుడు లేడు అనే అహం తలకెక్కినపుడు దాన్ని తగ్గించేందకు పరమాత్ముడు తనదైన శైలిలో నాటకమాడుతుంటాడు. భీముడి విషయంలో జరిగింది కూడా ఇదే. కురుక్షేత్రంలో పూర్తిస్థాయిలో బలప్రదర్శన చేయాలంటే అహంకారం పనికిరాదు. వివేకంతో కూడిన బలాన్ని ప్రదర్శించాలి. బహుశా దీనికోసమే ఆయన పరీక్షలను ఎదుర్కొని ఉంటాడు. అరణ్యవాసం సమయంలో ధర్మరాజు ఆదేశాల మేరకు సమీపంలోకి కొలనులో తామరపువ్వులను తీసుకొచ్చేందుకు వెళ్లిన భీముడిని కొండచిలువ చుట్టేస్తుంది. ఏనుగులను సైతం పిండిచేయగల బలాడ్యుడు భీముడు. కానీ, ఆ బలం నకషుడు అనే కొండచిలువ ముందు ఏమాత్రం పనిచేయలేదు. ఎంత ప్రయత్నించినా దాని నుంచి బయటపడలేకపోయాడు.
పువ్వులు తీసుకొస్తానని వెళ్లిన భీముడు ఎంతసేపటికీ రాకపోవడంతో ధర్మరాజు ఆ కొలను ప్రాంతానికి వస్తాడు. కొండచిలువపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అయితే, ఆ కొండచిలువ ధర్మరాజును కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. ఆ ప్రశ్నలకు ధర్మరాజు వివేకంతో జవాబులు చెబుతాడు. కొండచిలువ భీముడిని వదిలివేయడంతో పాటు శాపవిమోచనం కలుగుతుంది. తానో యక్షుడినని, బలం ఉందనే అహంకారంతో వ్యవహరించి ముని శాపానికి గురయ్యానని, ఇన్నాళ్లకు శాపవిమోచనం కలిగిందని చెప్పి వెళ్లిపోతుంది. బలంతోనే అన్నింటినీ జయించలేమని భీముడు అర్ధం చేసుకుంటాడు.
వనవాసం సమయంలోనే భీముడు మరోసారి కూడా ఓటమిపాలయ్యాడు. నకషుడి చేతిలో పరాజయం పాలైన తరువాత కూడా బలం విషయంలో భీముడిలో ఎలాంటి మార్పు లేదు. ఎలాగైనా ఆ అహంకారాన్ని అణిచాలనే హనుమయ్య పథకం వేశారు. బలంలో హనుమంతుడికి మించినవాడు లేదు. ఓ ముసలికోతి రూపంలో హనుమయ్య దారికి అడ్డంగా కూర్చొని ఉంటాడు. అటుగా వస్తున్న భీముడు తొకను పక్కకు జరపమని అంటాడు. పండుముసలిని నేను లేవలేను… నువ్వే పక్కకు జరుపు అంటుంది ఆ కోతి. సరేకదా అని భీముడు కోతి తోకను పక్కకు జరిపే ప్రయత్నం చేస్తాడు. ఎంత ప్రయత్నించినా తోకను ఇంచు కూడా కదిలించలేకపోతాడు. బలం పూర్తిగా తగ్గిపోవడంతో భీముడి బుర్రలో ఆలోచన మొదలౌతుంది. అక్కడ ఉన్నది సామాన్యకోతి కాదని, సాక్షాత్తు హనుమంతుడే అని గ్రహించి పరిపరివిధాలుగా వేడుకుంటాడు. ఈ వేడుకోలుకు మెచ్చుకున్న హనుమయ్య అసులు రూపం దాల్చి భీముడికి హితబోధ చేస్తాడు.
భీముడి కుమారుడు ఘటోత్కచుడు. ఆయన పుత్రుడు బర్బరీకుడు. మహా బలవంతుడు. అంతకు మించిన తపస్వీ. ఆయన కదనరంగంలోకి దిగితే ఎవ్వరూ నిలువజాలరు. వనవాసం సమయంలోనే భీముడు బర్బరీకుడి చేతిలో పరాభవానికి గురౌతాడు. బర్బరీకుడు నిత్యం ఓ సరస్సులోని నీటితో మహాశివునికి అభిషేకం చేస్తుంటాడు. అయితే, ఓరోజు భీముడు ఆ సరస్సులోకి దగడం గమనించిన బర్భరీకుడు ఆగ్రహంతో భీముడిపై తిరగబడతాడు. బర్భరీకుడి బలాన్ని చూసి భీముడు ఆశ్చర్యపోతాడు. బర్భరీకుని గుణగణాలను ప్రశ్నించగా, ఆయన చెప్పిన సమాధానం విని పరమానందం పొందుతాడు. మనవడి చేతిలో ఓడిపోయినందుకు సంతోషం వ్యక్తం చేస్తాడు. కానీ బర్భరీకుడు తన తాతగారిని అవమానించాడని తెలుసుకొని ఆత్మాహుతికి పాల్పడేందుకు ప్రయత్నించగా భీముడు వారిస్తాడు. భీముడి ఓటములనుంచి మనం నేర్చుకోవలసిన నీతి ఏమంటే, మనలోని నైపుణ్యం మనకు బలం కావాలి తప్పిస్తే అహంభావం కాకుడదు. అహంభావం, అహంకారం లేకుండా ఉంటే ఎంతటి కష్టమైన పని అయినా సరే దైవానుగ్రహంతో పూర్తి చేయగలుగుతాం. ఈ కథ నుంచి మనం నేర్చుకోవలసిన నీతి కూడా ఇదే.