సంక్రాంతి సీజన్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ శుక్రవారం విడుదలయ్యే సినిమాలపై పడింది. ఒకేసారి ఎనిమిదికి పైగా కొత్త చిత్రాలు థియేటర్లలోకి రానున్నప్పటికీ, వాటి చుట్టూ పెద్దగా హైప్ కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం స్టార్ హీరోలు లేని లైన్-అప్ కావడమే. పెద్ద పేర్లు లేకపోవడంతో సాధారణ ప్రేక్షకుల్లో ఆసక్తి తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.
‘ఒక్కడు’, ‘చూడాలని ఉంది’ వంటి బ్లాక్బస్టర్లతో గుర్తింపు పొందిన దర్శకుడు గుణశేఖర్ ఇప్పుడు ‘యూఫోరియా’ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రధానంగా సారా అర్జున్ పాత్రను హైలైట్ చేస్తూ ప్రమోట్ చేస్తున్నారు. అయితే సినిమా సీరియస్ థీమ్‌తో ఉండటంతో అది ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది. సారా ధురంధర్ లో అదరగొట్టడం తో ఈ సినిమా పైన అంచనాలు ఉన్నాయ్!
ఇక నెక్స్ట్ ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ రూపొందించిన హారర్ డ్రామా ‘హనీ’ కూడా ఇదే శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమాకు మొదటి రోజు ప్రీమియర్ టాక్ చాలా కీలకం. మంచి మాటామాట ప్రచారం వస్తేనే సినిమా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. తమిళం నుంచి డబ్ అయిన యూత్‌ఫుల్ లవ్ స్టోరీ ‘విత్ లవ్’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై మాత్రం మిగతా చిత్రాలతో పోలిస్తే కొంచెం మెరుగైన ఆసక్తి కనిపిస్తోంది.
మరోవైపు శ్రీ చిదంబరం గారు ఆన్లైన్లో విభిన్నమైన ప్రమోషన్ పద్ధతులు ప్రయత్నిస్తూ సినిమాపై దృష్టి ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరో బోల్డ్ పాట పాడడం వల్ల చిన్న వివాదం రేగింది. అయినప్పటికీ ఈ చిత్రంపై అంచనాలు మాత్రం చాలా ఎక్కువగా లేవు.
రవి తేజా నుంచి ప్రమోషనల్ వీడియో బైట్ అందుకున్న ‘సుమతి శతకం’ కూడా ఇదే సమయంలో విడుదలవుతోంది. ఇది బుల్లి తెర స్టార్ అమరదీప్ హీరో గా వస్తున్నా సినిమా. సో, కొంచం హైప్ ఉంది! అలాగే ‘ఎర్ర చీర’ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కొత్త సినిమాల కంటే రీ-రిలీజ్ చిత్రాలకే అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ మళ్లీ విడుదలవుతుండగా, ఇది చాలా కొత్త సినిమాల కంటే మెరుగైన బుకింగ్స్ నమోదు చేస్తోంది. అదే విధంగా ధనుష్ నటించిన ‘3’ సినిమాకు కూడా మంచి స్పందన కనిపిస్తోంది.