ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే కాదు… మొత్తం భారతీయ సినిమా పరిశ్రమలో టాప్ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటిగా హోంబాలే ఫిల్మ్స్ నిలుస్తోంది. భారతీయ సినిమాకే గర్వకారణంగా నిలిచే కొన్ని అద్భుత చిత్రాలను నిర్మించిన ఈ బ్యానర్, ఇప్పుడు మరోసారి అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చూపించడానికి సిద్ధమైంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఆస్కార్ అకాడమీ అవార్డ్స్ 2026లో బెస్ట్ పిక్చర్ విభాగానికి కాంతారా చాప్టర్ 1ను అధికారికంగా ఎంటర్ చేసినట్లు హోంబాలే ఫిల్మ్స్ ప్రకటించింది.
ఇక్కడితో ఆగలేదు హోంబాలే. వాళ్లు డిస్ట్రిబ్యూట్ చేసిన మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ కూడా అదే ఆస్కార్ రేసులో ఉండటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అదే ‘మహావతార్ నరసింహ’. ఈ చిత్రాన్ని కూడా అకాడమీ అవార్డ్స్ 2026 బెస్ట్ పిక్చర్ కంటెన్షన్‌లోకి పంపినట్టు అధికారికంగా వెల్లడించారు. ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి రెండు సినిమాలు ఆస్కార్ రేసులో ఉండటం… హోంబాలే ఫిల్మ్స్ స్థాయిని చెప్పే విషయమే.
ఈ రెండు సినిమాలు కూడా ఎంతో ప్రతిష్ఠాత్మకమైనవే. అయితే, విశ్లేషకుల అంచనాల ప్రకారం మహావతార్ నరసింహకు కాంతార చాప్టర్ 1పై కొంత ఆధిక్యం ఉండే అవకాశముందని చర్చ జరుగుతోంది. కారణం… ఇది ఒక యానిమేటెడ్ ఫిల్మ్ కావడమే. హాలీవుడ్‌లో ప్రస్తుతం యానిమేషన్ సినిమాలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుంటే, జ్యూరీ సభ్యులు సంప్రదాయ కమర్షియల్ సినిమాల కంటే నరసింహ వంటి యానిమేటెడ్ చిత్రాన్ని ప్రత్యేకంగా పరిగణించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, బాలీవుడ్ నుంచి మరో సినిమా కూడా ఆస్కార్ రేసులో ముందుకు సాగుతోంది. హిందీ చిత్రం ‘హోంబౌండ్’ ఇటీవలే అకాడమీ అవార్డ్స్ అధికారిక ఎంట్రీ విభాగంలో టాప్ 15లో చోటు దక్కించుకుంది.
మొత్తానికి… ఆస్కార్ 2026 భారతీయ సినిమాలకు చాలా ప్రత్యేకంగా మారబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హోంబాలే ఫిల్మ్స్ మాత్రం… ఇండియన్ సినిమాను గ్లోబల్ స్టేజ్‌పై మరో మెట్టు పైకి తీసుకెళ్లే దిశగా గట్టిగా అడుగులు వేస్తోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.