ప్రతిష్ఠాత్మక అకాడమీ అవార్డులు… అదే ఆస్కార్ 2026 పోటీల్లో ఈ ఏడాది భారత్ నుంచి పోటీలో నిలిచిన ఏకైక చిత్రం ‘హోంబౌండ్’. ఈ సినిమా ఇప్పుడు మరో కీలక అడుగు ముందుకు వేసింది. ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఈ సినిమా విజయం సాధించే అవకాశాలు మరింత బలపడ్డాయి. ఈ పరిణామం తుది నామినేషన్‌పై ఆశలను పెంచింది.
సోమవారం అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో తదుపరి రౌండ్‌కు ఎంపికైన టాప్ 15 చిత్రాల జాబితాను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చిన చిత్రాలతో పాటు ‘హోంబౌండ్’ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకుంది.
ఇప్పుడు ఈ 15 చిత్రాల నుంచి ఐదు తుది పోటీదారులను ఎంపిక చేయనున్నారు. తుది ఆస్కార్ నామినేషన్లు జనవరి 22న ప్రకటించనుండగా, విజేతలను మార్చి 15న లాస్ ఏంజెల్స్‌లో జరిగే ఘనమైన వేడుకలో వెల్లడిస్తారు.

ఈ టాప్ 15 జాబితాలో అర్జెంటీనా నుంచి ‘బెలెన్’, బ్రెజిల్ నుంచి ‘ది సీక్రెట్ ఏజెంట్’, ఫ్రాన్స్ నుంచి ‘ఇట్ వాస్ జస్ట్ అన యాక్సిడెంట్’, జర్మనీ నుంచి ‘సౌండ్ ఆఫ్ ఫాలింగ్’, జపాన్ నుంచి ‘కోకుహో’, దక్షిణ కొరియా నుంచి ‘నో అదర్ ఛాయిస్’ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలు ఉన్నాయి. అలాగే ఇరాక్, జోర్డాన్, నార్వే, పాలస్తీనా, స్పెయిన్, స్విట్జర్లాండ్, తైవాన్, ట్యునీషియా నుంచి వచ్చిన సినిమాలు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
ఇప్పటికే ‘హోంబౌండ్’ భారతీయ సినీ చరిత్రలో ఒక అరుదైన ఘనత సాధించింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో టాప్ 15కి ఎంపికైన భారత్ నుంచి ఐదవ చిత్రంగా ఇది నిలిచింది. ఈ సినిమా ఆస్కార్‌ను సొంతం చేసుకుంటే, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గొప్ప కల నిజమవుతుంది.
ఈ చిత్రానికి నీర్జ్ ఘయ్వాన్ దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించారు. ఇషాన్ ఖట్టర్, విశాల్ జేత్వా, జాన్వీ కపూర్ ముఖ్య పాత్రల్లో నటించారు. తమ సామాజిక స్థితిని దాటుకుని ఎదగాలనే ప్రయత్నంలో ఉన్న ఇద్దరు స్నేహితులు, కోవిడ్ మహమ్మారి సమయంలో ఎదుర్కొనే అనుకోని పరిణామాల చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది.