కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ నటించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన చివరి సినిమా ‘జన నాయగన్’ విడుదల కి ఇంకా కేవలం రెండు రోజులే మిగిలి ఉండగా, రిలీజ్ పై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. సెన్సార్ బోర్డు కొన్ని కట్లు, మ్యూట్స్ సూచించడంతో ఇప్పటివరకు సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వకపోవడం ఇందుకు కారణం.
డిసెంబర్ 18న సినిమాను సెన్సార్‌కు పంపినప్పటికీ, ఇప్పటివరకు క్లియరెన్స్ రాకపోవడంతో రిలీజ్ ప్లాన్స్ పూర్తిగా గందరగోళంగా మారాయి. చివరి నిమిషంలో ఎదురైన ఈ అడ్డంకులతో విజయ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి సజావుగా పరిష్కరించేందుకు నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు.

నిర్మాతల తరఫున వాదించిన న్యాయవాది మాట్లాడుతూ… సెన్సార్ బోర్డు సూచించిన మార్పులన్నీ చేసి డిసెంబర్ 24న ఎడిటెడ్ కాపీని తిరిగి సమర్పించామని, కానీ దాదాపు పది రోజుల పాటు ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. అనంతరం జనవరి 5న వచ్చిన సమాచారం ప్రకారం, సినిమా కంటెంట్‌పై అజ్ఞాత ఫిర్యాదుల ఆధారంగా చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి పంపాలని సీబీఎఫ్‌సీ నిర్ణయించినట్లు వెల్లడించారు.
వాదనలు విన్న కోర్టు… ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని రికార్డులను సమర్పించాలని సీబీఎఫ్‌సీని ఆదేశిస్తూ, విచారణను బుధవారానికి వాయిదా వేసింది. దీంతో అభిమానులు ఉత్కంఠతో తుది తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల తేదీ భవితవ్యం ఇప్పుడు కోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంది.

కోర్టు నుంచి అనుకూల ఉత్తర్వులు రాకపోతే ఇది చిత్ర బృందానికి పెద్ద ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉంది. సినిమా వాయిదా పడితే ట్రేడ్ వర్గాల్లో తీవ్ర గందరగోళం నెలకొంటుంది. ఎందుకంటే తమిళనాడు వ్యాప్తంగా థియేటర్లతో ఒప్పందాలు ఇప్పటికే పూర్తయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి… దేశీయంగా, విదేశాల్లోనూ చాలా షోస్ వేగంగా ఫుల్ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా, ఈ సినిమా చుట్టూ నెలకొన్న వివాదాల మధ్య కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి విజయ్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. సినిమా విడుదలకు ముందు విజయ్ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో పాలక పార్టీ ఇలా చేస్తోందని అభిమానులు ఆరోపిస్తున్నారు.