పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంత నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. గతంలో పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో సినిమా నిర్మాణంలోకి వస్తారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అలాంటి ఊహాగానాలకు బలం చేకూర్చేలా ఒక కొత్త వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ నిర్మాణ సంస్థ బ్యానర్‌పై తాజాగా విడుదలైన “KARATEKA to SAMURAI” అనే టైటిల్ ఉన్న వీడియోలో పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్టిస్ట్ లుక్‌లో కనిపించారు. ఆ గెటప్, బాడీ లాంగ్వేజ్ చూస్తే… ఏదో కొత్త ప్రయోగానికి పవన్ సిద్ధమవుతున్నారన్న ఫీలింగ్ అభిమానులకు బలంగా కలుగుతోంది. అయితే, ఈ వీడియోలో అసలు విషయం ఏమిటన్నది మాత్రం గోప్యంగా ఉంచారు.
ఈ వీడియోతో సోషల్ మీడియాలో అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. కొందరు అభిమానులు పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ స్కూల్ ప్రారంభించబోతున్నారని అంచనా వేస్తుంటే, మరికొందరు ఇది ఒక ప్రత్యేక వెబ్ సిరీస్ లేదా కాన్సెప్ట్ ప్రాజెక్ట్ కావచ్చని భావిస్తున్నారు. ఇంకొంత మంది అయితే ఇది OG 2కి సంబంధించిన చిన్న టీజర్ అయి ఉండొచ్చని అనుకుంటున్నారు. అయితే, అది OG 2 కాదని ఇప్పటికే స్పష్టత వచ్చింది.
ప్రస్తుతానికి ఈ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ ఏమి సూచిస్తున్నారు అన్నదానిపై ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు. అభిమానులు మాత్రం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక సినిమా విషయానికి వస్తే… పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మాత్రమే ఉంది. ఇంకా సురేందర్ రెడ్డి తో ఒక సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది! మరోవైపు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనా కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.
మొత్తానికి KARATEKA to SAMURAI వీడియో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అసలు దీని వెనుక ఉన్న ఆలోచన ఏమిటన్నది తెలియాలంటే… ఇంకొంతకాలం వేచిచూడాల్సిందే.