దేశ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నాయకుడు నరేంద్ర మోదీ జీవితం ఇప్పుడు వెండితెరపైకి రాబోతోంది. ఆయన జన్మదినం సందర్భంగా సిల్వర్ క్యాస్ట్ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్‌కు ‘మా వందే’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా మోదీ గారి చిన్ననాటి నుండి భారత దేశపు అతి పెద్ద ప్రజాస్వామ్యానికి ప్రధాన మంత్రి పదవి వరకు చేరుకున్న ప్రయాణాన్ని అద్భుతంగా ఆవిష్కరించబోతోంది.
ఈ పాత్రలో ఉన్నీ ముకుందన్ ప్రధాన పాత్రధారిగా నటించనున్నారు. చిన్నప్పటి కలలతో మొదలైన ప్రయాణం ఎలా విశ్వనాయకత్వానికి దారి తీసిందో, మధ్యలో ఎదురైన కష్టాలు, త్యాగాలు, మానసిక బలాన్ని ఆయన ఎలా పెంచుకున్నారో ఈ చిత్రం చూపించనుంది.
కథానాయకుడు ఉన్ని ముకుందన్ కూడా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ని సోషల్ మీడియా లో షేర్ చేస్తూ, మన మోదీ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు…
ఈ సినిమాలో అత్యంత భావోద్వేగభరితమైన అంశం మోదీ తల్లి హీరాబెన్‌తో ఆయనకున్న అనుబంధం. చిన్నప్పటి నుండి తన తల్లి ఇచ్చిన విలువలు, స్ఫూర్తి, ఆప్యాయత మోదీ జీవితం మొత్తానికి ఒక దిశానిర్దేశం అయ్యాయి. ఆమె ఇచ్చిన ప్రేరణే ఆయనను ఇంతటి శిఖరానికి తీసుకెళ్లింది అని ఈ చిత్రం స్పష్టంగా తెలియజేయబోతోంది.
దర్శకుడు క్రాంతి కుమార్ సి.హెచ్. ఈ ప్రాజెక్ట్‌ను హృదయానికి హత్తుకునేలా, నిజ సంఘటనలకు దగ్గరగా చూపించబోతున్నారు. ఈ చిత్రానికి ఇండియన్ సినిమా రంగంలో అగ్రశ్రేణి టెక్నికల్ టీమ్ పనిచేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది:
కె.కె. సెంటిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, అద్భుతమైన విజువల్ ట్రీట్ అందించనున్నారు. రవి బస్రూర్ సంగీతం, కథలోని భావోద్వేగాన్ని మరింతగా పెంచబోతోంది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, కథను కట్టిపడేసేలా తీర్చిదిద్దనున్నారు. సాబు సిరిల్ సెట్స్ డిజైన్, చారిత్రక క్షణాలను ఘనంగా మలచనుంది. కింగ్ సాలమన్ యాక్షన్ సీక్వెన్స్‌లు, మోదీ జీవితంలోని పోరాటాన్ని ప్రతిబింబించనున్నాయి.
‘మా వందే’ ఒక బయోపిక్ మాత్రమే కాదు. ఇది త్యాగం, పట్టుదల, తల్లి ప్రేమ, దేశభక్తి, నాయకత్వం కలిసిన మహత్తర గాథ. భారతీయ సినీ పరిశ్రమలో స్ఫూర్తిదాయకంగా నిలిచే ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే విపరీతమైన అంచనాలను రేపుతోంది.