ఈరోజు తెలుగు సినిమా పరిశ్రమ కి ఎంతో సేవ చేసిన ఘంటసాల జయంతి సందర్బంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘంటసాల గారిని స్మరించుకుని ట్విట్టర్ లో అయన గురించి చాల గొప్ప విషయాలు చెప్పారు…
“తెలుగు సంగీత, సాహిత్య గొప్పదనాన్ని తన గాత్రంతో, సంగీతంతో విశ్వవ్యాపితం చేసిన మహానుభావుడు, సంగీత దిగ్దర్శకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. సంగీత దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టాక ముందు, స్వాతంత్ర్య సంగ్రామం సమయంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 18 నెలల పాటు కారాగారంలో గడిపిన దేశభక్తుడు ఘంటసాల గారు. మన దేశం, మాయాబజార్, గుండమ్మ కథ లాంటి చిత్రాలు ఎప్పటికీ నిలిచిపోయాయి. అన్నమాచార్యుల అనంతరం, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి మూలవిరాట్ సన్నిధిలో కీర్తనలు పాడిన ఘనత ఘంటసాల గారిది.
ఆయన స్వర్గస్తులైన అయిదు దశాబ్దాలు గడిచినా, ఆయన స్వరం, ఆయన అందించిన సంగీతం నేటికీ ప్రతి తెలుగు ఇంటిలో మ్రోగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆయన స్వరపరిచిన భగవద్గీత పారాయణం వినిపించని ఊరు లేదంటే అది అతిశయోక్తి కాదు. ఆయన జయంతి సందర్భంగా, తెలుగు సినీ మరియు సాహిత్య రంగాలకు ఆయన అందించిన అపూర్వ సేవలను గౌరవంగా స్మరించుకుంటూ, గాన గంధర్వులు శ్రీ ఘంటసాల గారికి ఘనమైన నివాళి అర్పిస్తున్నాను.”