ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి, ‘ఉండి’ ఎమ్మెల్యే రఘు రామ కృష్ణ రాజు అంటే కేవలం దూకుడు రాజకీయ నాయకుడిగానే కాదు… సమాజంపై బలమైన బాధ్యతతో పాటు నాటకం, నటన పట్ల ప్రత్యేక ఆసక్తి ఉన్న వ్యక్తిగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది.
గత ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన శాసనసభ సాంస్కృతిక కార్యక్రమంలో దుర్యోధనుడి పాత్రలో మోనోలాగ్ స్కిట్ చేయడం ద్వారా రఘు రామ కృష్ణ రాజు తన నటన ప్రతిభను అందరికీ చాటిచెప్పారు. ఆ ప్రదర్శన అప్పట్లో మంచి ప్రశంసలు అందుకుంది.
ఇప్పుడు మరోసారి ఆయన వినోదంపై ఉన్న ప్రేమను చూపిస్తూ… గాయని స్మితా తాజాగా విడుదల చేసిన ర్యాప్ సాంగ్ ‘భీమవరం బీట్’ లో ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించారు. పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించే ఈ పాటలో కేవలం కొన్ని క్షణాలపాటు కనిపించినప్పటికీ, RRR ఎంట్రీ మాత్రం పాటకు అదనపు ఆకర్షణగా నిలిచింది.
ఆయన ట్రేడ్‌మార్క్ ఆల్-వైట్ గెటప్‌లో, మీసం తిప్పుతూ కనిపించిన దూకుడు స్టైల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మొదట ఒంటరిగా డ్యాన్సర్ల మధ్యలో ఎంట్రీ ఇచ్చిన RRR, తరువాత స్మితా మరియు నోయెల్ సీన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేశారు.
2000లలో తన ప్రత్యేక హస్కీ వాయిస్‌తో పాప్ కల్చర్‌ను టాలీవుడ్‌కు చేరువ చేసిన స్మితా… ఇటీవల పాత హిట్ పాటలను కొత్త స్టైల్‌లో రీమిక్స్ చేస్తూ వస్తున్నారు. నోయెల్ సీన్‌తో కలిసి కొన్ని రోజుల క్రితం ‘మసక మసక’ పాటను 25వ వార్షికోత్సవం సందర్భంగా కొత్తగా విడుదల చేశారు.
ఇప్పుడు సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ‘భీమవరం బీట్’ పాట గ్లిట్జీ విజువల్స్, ఫుట్-ట్యాపింగ్ ట్యూన్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ పాటకు సంగీతాన్ని స్మితా, నోయెల్ ఇద్దరూ కలిసి అందించగా… రఘు రామ కృష్ణ రాజు క్యామియో పాటకు మరింత హైప్ తెచ్చిపెట్టింది.