ఈ సంక్రాంతి సీజన్లో థియేటర్లలో ముందుగా సందడి చేయబోతోంది ప్రభాస్ నటించిన ‘రాజా సాబ్’. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే… ఈ రెండు సినిమాలకు టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది.
ఈ రెండు సినిమాల నిర్మాతలు ముందుగానే ప్రభుత్వాన్ని సంప్రదించి అనుమతులు కోరబోతున్నారని ఇప్పటికే సమాచారం ఇచ్చాం. గతంలో OG, అఖండ 2 లాంటి సినిమాల విషయంలో టికెట్ హైక్స్‌కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీఓలను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. అయితే ఈసారి కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

గతంలో వచ్చిన సింగిల్ బెంచ్ తీర్పు పుష్ప 2, OG, గేమ్ చేంజర్, అఖండ 2 సినిమాలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. అందువల్ల రాజా సాబ్, మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలకు టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోల విషయంలో అనుమతులు ఇచ్చింది.
ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే… ఈ రెండు సినిమాల నిర్మాతలు రిలీజ్‌కు చాలా ముందే అవసరమైన అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఎలాంటి అడ్డంకులు వచ్చినా ముందుగానే పరిష్కరించుకునే అవకాశం వారికి దక్కింది. ఈ ఏడాది బాక్సాఫీస్‌ను ఓపెన్ చేయబోతున్న ఈ భారీ సినిమాలతో, పండుగ సీజన్లో ప్రేక్షకులకు ఫుల్ ఫీస్ట్ ఖాయం అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.