తెలుగు సినిమా కేవలం వినోదం కాదు… అది మన సంస్కృతి, పురాణాలు, నైతికతల ప్రతిబింబం. అందులో అత్యంత లోతుగా, నిశ్శబ్దంగా ప్రవహించిన మహాకావ్యం రామాయణం. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… తెలుగు సినిమాలు రామాయణాన్ని నేరుగా కథగా చెప్పిన దానికంటే, నీడలా, భావంగా, రూపకంగా ఎక్కువగా వాడుకున్నాయి.
1950–60ల కాలంలో రామాయణం తెరపై స్పష్టంగా కనిపించింది. లవకుశ, సంపూర్ణ రామాయణం వంటి చిత్రాలు భక్తి ప్రధానంగా, శాస్త్రీయ రూపంలో తెరకెక్కాయి. అప్పట్లో సినిమా అంటే ఆలయం లాంటిది. ప్రేక్షకుడు భక్తుడిలా చూసేవాడు. రాముడు ఆదర్శ పురుషుడు, సీత పవిత్రతకు ప్రతీక, రావణుడు అహంకారానికి చిహ్నం. ఈ ఫార్ములా స్పష్టంగా కనిపించింది.
కానీ అసలైన మలుపు 80..90కాలం తర్వాత వచ్చింది. దర్శకులు రామాయణాన్ని కథగా కాకుండా సైకలాజికల్ ఫ్రేమ్‌గా వాడడం మొదలుపెట్టారు. ఉదాహరణకు… హీరో అంటే కేవలం బలవంతుడు కాదు… బాధ్యతగల రాముడిలా ఉండాలి. హీరోయిన్ అంటే కేవలం ప్రేమ కాదు, సీతలా సహనం, గౌరవం కలిగి ఉండాలి. విలన్ అంటే రావణుడిలా తెలివైనవాడు, కానీ అహంకారంతో పతనమయ్యే వాడు. ఇది ప్రతీ సినిమాలో మనకు కనిపించే దృశ్యమే.
‘రామాయణం అనేది కుటుంబ విలువలు’ అన్న భావన అనేక కుటుంబ కథా చిత్రాల్లో కనిపిస్తుంది. తండ్రి మాటకు విలువ ఇవ్వడం, భార్యను గౌరవించడం, త్యాగం చేయడం ఇలా ప్రతీ ఒక్కటీ రామాయణం నుంచి పుట్టిన సినిమాటిక్ సీన్లే అని చెప్పాలి. సినిమాలోని ఏ సన్నివేశం తీసుకున్నా అది రామాయణంలోని ఏదో ఒక పాత్రతో, ఏదోఒక సన్నివేశంతో ముడిపడుతుంది.
ఆధునిక కాలంలో రామాయణం మరింత సూక్ష్మంగా మారింది. బాహుబలిలో రాజ్యం కోసం పోరాటం, త్యాగం, ధర్మం… ఇవన్నీ రామాయణ ఛాయలే. అయితే ఇక్కడ రాముడు కూడా సందేహాలతో, పరీక్షలతో నిండిన మనిషి. ఇది రామాయణానికి కొత్త, ఆధునిక మలుపుగా చెప్పాలి.
కొన్ని సినిమాలు రామాయణాన్ని రివర్స్ కోణంలో వాడుకున్నాయి. అంటే… సీతను కాపాడేది రాముడు మాత్రమే కాదు. కొన్ని కథల్లో సీతే తనను తాను రక్షించుకుంటుంది. ఇది సమకాలీన స్త్రీవాద దృష్టికోణం. అలాగే రావణుడు కేవలం రాక్షసుడు కాదు… అతడు కూడా పండితుడు, వీరుడు అన్న కోణం కొన్ని చిత్రాల్లో కనిపిస్తుంది.
ఇంకా లోతుగా చూస్తే, తెలుగు సినిమాల్లోని “అడవి ప్రయాణం” ఎప్పుడూ రామాయణ ప్రతిధ్వనిలా ఉంటుంది. హీరో కష్టాల్లో పడినప్పుడు, అతడు అడవికి వెళ్లడం కనిపిస్తుంది. అంటే… పరీక్షల మార్గంలో నడవడం. అక్కడే అతని అసలైన వ్యక్తిత్వం బయటపడుతుంది.
క్లైమాక్స్‌లో “ధర్మమే గెలుస్తుంది” అన్న భావన కూడా రామాయణం నుంచి వచ్చినది. తెలుగు ప్రేక్షకుడు అనుకోకుండానే ఈ నైతికతను అంగీకరిస్తాడు. ఎందుకంటే అది మన అవచేతనంలో నాటుకుపోయింది. మొత్తానికి రామాయణం తెలుగు సినిమాలకు కేవలం కథ కాదు. అది నైతిక భాష, భావోద్వేగ భావనలు, సాంస్కృతిక వారసత్వం. ప్రతి ప్రేమ కథలో సీత కనిపిస్తుంది. ప్రతి ధైర్యవంతుడైన హీరోలో రాముడు ప్రతిధ్వనిస్తాడు. ప్రతి అహంకార విలన్లో రావణుడి ఛాయ కనిపిస్తుంది.
అందుకే… రామాయణం ముగిసిన గ్రంథం కాదు. అది ప్రతి తెలుగు సినిమాలో కొనసాగుతున్న జీవ కథ.