రష్మిక మందన్న ప్రధాన పాత్రలో వచ్చిన తొలి లేడీ సెంట్రిక్ సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ బాక్సాఫీస్ వద్ద వీకెండ్ లో ఊపందుకుంది. సున్నితమైన అంశంతో, ఆలోచన రేకెత్తించే కంటెంట్‌తో తెరకెక్కిన ఈ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ₹1.4 కోట్లు నెట్ కలెక్షన్‌తో నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, మౌత్ టాక్ పాజిటివ్‌గా మారడంతో శనివారం భారీగా పుంజుకుంది.
రెండవ రోజు ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ వద్ద సుమారు ₹2.5 కోట్లు నెట్ కలెక్షన్ సాధించింది. ఇది మొదటి రోజు కంటే గణనీయమైన పెరుగుదల. విదేశీ మార్కెట్లలో కూడా రెండు రోజుల్లో మొత్తం కలెక్షన్ $250K మార్క్‌ను దాటింది.

శనివారం సాయంత్రానికి ‘ది గర్ల్‌ఫ్రెండ్’ బుక్ మై షోలో టాప్ ట్రెండింగ్‌లోకి ఉంది. టికెట్ సేల్స్ మొదటి రోజుతో పోలిస్తే రెట్టింపు కాగా, ఆడియన్స్ రేటింగ్స్ కూడా స్థిరంగా పెరుగుతున్నాయి. సోషల్ మీడియా, ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫార్మ్స్ అంతటా సినిమా గురించి చర్చలు హాట్ టాపిక్‌గా మారాయి. అర్బన్ ప్రేక్షకుల్లో ఈ చిత్రం వర్డ్ ఆఫ్ మౌత్ హిట్‌గా నిలుస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
పుష్ప 2, యానిమల్ వంటి భారీ హిట్స్ తరువాత రష్మిక ఇప్పుడు టాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న నటి. అలాంటి స్థాయిలో ఉన్న ఆమె చేసిన ఈ కంటెంట్ బేస్డ్ మూవీకి ప్రారంభం నెమ్మదిగా రావడం పెద్ద ఆశ్చర్యం కాదు. కానీ బలమైన రివ్యూస్, పెరుగుతున్న బుకింగ్స్ కలయిక ఈ సినిమాకు వీకెండ్‌లో మంచి బూస్ట్ ఇస్తోంది.

బుక్ మై షో ట్రెండ్స్ హాట్‌గా ఉండడం, పాజిటివ్ రియాక్షన్స్ పెరుగుతుండడం చూస్తుంటే – ‘ది గర్ల్‌ఫ్రెండ్’ తన బాక్సాఫీస్ జర్నీని మరింత బలంగా కొనసాగించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.