గ్లామర్ పాత్రలకంటే బలమైన క్యారెక్టర్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, ఎంతో ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తూ తన కెరీర్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది మన నాచురల్ నటి సాయి పల్లవి. సింప్లిసిటీ ఇంకా ప్రాధాన్యం ఉన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించడం ఆమె ప్రత్యేకత. ఇప్పటివరకు ఎన్నో సున్నితమైన, లోతైన పాత్రలను తన సహజ నటనతో పెద్ద తెర మీద బొమ్మ ని మరింత అందంగా చూపించింది!
అందుకే తక్కువ కాలం లోనే ఇప్పుడు ఆమె కెరీర్లో అత్యంత పీక్ స్టేజి కు చేరుకుంది. త్వరలోనే ఆమె రెండు భారీ పాన్ ఇండియా సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించబోతోంది. దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ రెండు ప్రాజెక్ట్స్… నితేశ్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణం’ ఒకటి కాగా, మరొకటి నాగ్ అశ్విన్ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ ‘కల్కి 2898 AD’కి సీక్వెల్ అయిన ‘కల్కి 2’.

ఇప్పటికే ‘రామాయణం’ సినిమాలో సీతాదేవి పాత్ర కోసం సాయి పల్లవి షూటింగ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ భారీ మైథలాజికల్ చిత్రంలో సీత పాత్ర పోషించడం అంటే సాధారణ విషయం కాదు. ఆ పాత్రకు అపారమైన గౌరవం ఉంది. అందుకే ప్రేక్షకులు, విమర్శకులు ఈ పాత్రలో సాయి పల్లవి నుంచి కెరీర్లోనే అత్యుత్తమ నటనను ఆశిస్తున్నారు. ఇప్పటివరకు ఆమె సాధించిన విజయాలను మించి, మరో మెట్టు ఎక్కాల్సిన సవాల్ ఈ పాత్రలో ఉంది.
ఇదిలా ఉంటే, ‘కల్కి 2’ టీమ్‌కు సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం… ఈ సీక్వెల్లో కీలకమైన ‘సుమతి (సమ్–80)’ పాత్రకు సాయి పల్లవిని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. మొదటి భాగంలో ఈ పాత్రకు సంబంధించిన ప్రాధాన్యత గురించి పెద్దగా చూపించకపోయినా, సీక్వెల్ కథ మొత్తం ఈ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుందని సమాచారం. దీపికా పదుకొణె స్థానంలో ఈ పాత్రకు సాయి పల్లవిని ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ పాత్రకు గట్టి స్క్రీన్ ప్రెజెన్స్ ఉండబోతోందని, కథను మలుపుతిప్పే కీలక పాత్ర ఇదేనని అంటున్నారు.
సహజ నటనకు చిరునామాగా నిలిచిన సాయి పల్లవి ఈ పాత్రల్లో మెరిసిపోవడం ఖాయమని విశ్లేషిస్తున్నారు. ఇక విశేషమేమిటంటే… భారతీయ సినిమా చరిత్రలో చాలా అరుదైన ఘనతను సాయి పల్లవి సాధించబోతోంది. రామాయణం, మహాభారతం నుంచి ప్రేరణ పొందిన రెండు మైథలాజికల్ ఫాంటసీ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించే అవకాశం ఆమెకు దక్కింది. ఇది ఏ నటికైనా జీవితంలో ఒక్కసారి మాత్రమే దక్కే అరుదైన అవకాశం అని చెప్పొచ్చు. ఈ రెండు సినిమాలు సాయి పల్లవి కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లడమే కాదు… ఆమెను ఇండియన్ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానంలో నిలబెట్టే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.